Russian President: రష్యా అధ్యక్షుడు పుతిన్ కు విజయవంతంగా శస్త్రచికిత్స!
- పొత్తి కడుపు నుంచి నీటిని తొలగించే చికిత్స
- అది క్యాన్సర్ కు సంబంధించినది కాదు
- విజయవంతంగా పూర్తి
- టెలిగ్రామ్ ఛానల్ ఆధారంగా వెలుగులోకి తాజా కథనం
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన ప్రాణాంతక క్యాన్సర్ తో బాధపడుతున్నారని, సర్జరీ తప్పనిసరిగా చేయించుకోవాలని వైద్యులు సూచించినట్టు ఇటీవలే కథనాలు వెలుగు చూశాయి. కానీ, తాజాగా ఆయనకు ఒక సర్జరీ జరిగింది.
ఉదర భాగంలో (పొత్తి కడుపు) నీటిని తొలగించే సర్జరీ ఆయనకు ఈ నెల 12 లేదా 13వ తేదీ రాత్రి జరిగినట్టు సమాచారం. ఎటువంటి సమస్యల్లేకుండా ఆపరేషన్ విజయవంతంగా జరిగిందంటూ ఒక కథనం ప్రసారమైంది. రష్యా విదేశీ గూఢచార విభాగం జనరల్ కు చెందిన టెలిగ్రామ్ ఛానల్ సమాచారం ఈ కథనానికి నేపథ్యంగా ఉంది.
ఈ నెల 12 లేదా 13 వ తేదీ పుతిన్ కు జరిగిన సర్జరీ క్యాన్సర్ సంబంధితం కాదని ఈ కథనం పేర్కొంది. ఈ సర్జరీ కారణంగానే ఆయన ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనలేకపోయినట్టు సమాచారం. దీనికి బదులు సదరు సమావేశంలో ముందుగా రికార్డు చేసిన వీడియో సందేశాన్ని వినిపించారు. ‘‘ఈ సర్జరీ ప్రక్రియ అన్నది రష్యా అధ్యక్షుడికి గతంలో సూచించిన సర్జరీ (క్యాన్సర్)కి సంబంధించినది కాదు. అది ఇంకా జరగాల్సి ఉంది’’ అని సదరు టెలిగ్రామ్ చానల్ లో పోస్ట్ ఉండడం గమనార్హం.