Aurangzeb: ఎంఎన్ఎస్ హెచ్చరికతో.. ఔరంగజేబ్ సమాధి మూసివేత!

Aurangzeb tomb closed for 5 days

  • ఔరంగజేబ్ సమాధిని ధ్వంసం చేయాలన్న ఎంఎన్ఎస్ నేత గజానన్
  • దీంతో సమాధి ప్రాంతాన్ని లాక్ చేసేందుకు యత్నించిన మసీదు కమిటీ
  • ఐదు రోజుల పాటు సమాధిని మూసివేసిన పురావస్తు శాఖ

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిని భారత పురావస్తు శాఖ అధికారులు మూసివేశారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా ఖుల్తాబాద్ ప్రాంతంలో ఈ సమాధి ఉంది. మహారాష్ట్రలో ఔరంగజేబ్ సమాధి ఉండాల్సిన అవసరం ఏముందని మహారాష్ట్ర నవ నిర్మాణసేన (ఎంఎన్ఎస్) అధికార ప్రతినిధి గజానన్ కాలే ట్వీట్ చేశారు. ఔరంగజేబ్ సమాధిని ధ్వంసం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ట్వీట్ కలకలం రేపింది. 

ఈ నేపథ్యంలో సమాధి ఉన్న ప్రాంతంలోని మసీదు కమిటీ దానికి తాళం వేయడానికి ప్రయత్నించింది. మరోవైపు, ఔరంగజేబ్ మసీదు ఆర్కియాలజీ శాఖ అధీనంలో ఉంది. దీంతో సమాధికి లాక్ చేయాలని మసీదు కమిటీ యత్నించిన తర్వాత పురావస్తు శాఖ సమాధి ప్రాంతాన్ని మూసివేసింది. ఐదు రోజుల పాటు సమాధిని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు సమాధి వద్ద భద్రతను కూడా పెంచారు. 

ఈ అంశంపై పురావస్తు శాఖ ఔరంగాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ మిలన్ కుమార్ చౌలే మాట్లాడుతూ... మసీదు కమిటీ ఆ ప్రాంతాన్ని లాక్ చేయడానికి ప్రయత్నించిందని... తాము దాన్ని తెరిపించామని చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో, ఐదు రోజుల పాటు సమాధిని మూసి వేయాలని నిన్న నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఐదు రోజుల తర్వాత పరిస్థితిని బట్టి సమాధి ప్రాంతాన్ని తెరవాలా? లేక మరో ఐదు రోజుల పాటు మూసివేయాలా? అనే నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పారు. 
 
ఈ నెల ప్రారంభంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఔరంగజేబ్ సమాధిని సందర్శించిన తర్వాత వివాదం మొదలయింది. ఒవైసీ చర్యను బీజేపీ, శివసేన, ఎంఎన్ఎస్ పార్టీలు ఖండించాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా ఒవైసీపై విమర్శలు కురిపించారు. ప్రశాంతంగా ఉన్న మహారాష్ట్రలో కొత్త వివాదాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News