Amararaja: అమరరాజాపై బలవంతపు చర్యలొద్దు!... ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం!
- అమరరాజాకు పీసీబీ షోకాజ్ నోటీసులు
- నోటీసుల ఆధారంగా చర్యలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
- హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన అమరరాజా
- ఏపీ ప్రభుత్వం, పీసీబీ, ప్రధాన విద్యుత్ పంపిణీ సంస్థలకు సుప్రీం నోటీసులు
సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో కీలక కేసులో చుక్కెదురైంది. టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబం ఆధ్వర్యంలోని అమరరాజా బ్యాటరీస్‌పై ఎలాంటి బలవంతపు చర్యలకు దిగరాదని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా అమరరాజా బ్యాటరీస్‌కు కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన షోకాజ్ నోటీసులపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
అమరరాజా బ్యాటరీస్‌లో కాలుష్య నియంత్రణ మండలి సూచించిన ప్రమాణాలు లేవంటూ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఆ కంపెనీకి షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో పీసీబీ నోటీసులపై చట్టప్రకారం ముందుకు వెళ్లవచ్చని ఏపీ హైకోర్టు తీర్పు చెప్పిన విషయమూ విదితమే.
ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ అమరరాజా బ్యాటరీస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరగగా.. ఆ సంస్థపై బలవంతపు చర్యలు వద్దంటూ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం, పీసీబీ, ప్రధాన విద్యుత్ పంపిణీ సంస్థలకు సుప్రీం నోటీసులు జారీ చేసింది.