Janasena: పుస్తకరూపంలో జనసేన పార్టీ ప్రస్థానం, పవన్ కల్యాణ్ ప్రసంగాలు... ఫొటోలు ఇవిగో!
- 2014లో జనసేన ఆవిర్భావం
- ఇటీవలే ఎనిమిదేళ్లు పూర్తి
- ఏడు సంకలనాలు రూపొందించిన జనసేన మీడియా కమిటీ
- పుస్తకాలు పవన్ కు అందజేత
- ఆశ్చర్యపోయిన జనసేనాని
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఇటీవలే ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. 2014 మార్చి 14న జనసేన అవతరించింది. ఈ ఏడాది మార్చి 14న ఇప్పటంలో జనసేన పార్టీ భారీ ఎత్తున ఆవిర్భావ సభ నిర్వహించింది.
ఈ నేపథ్యంలో, ఆవిర్భావం నుంచి నేటి వరకు జనసేన పార్టీ ప్రస్థానం, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రసంగాలను పుస్తకాల రూపంలో తీసుకువచ్చారు. ఏడు సంకలనాలుగా రూపొందించిన ఈ పుస్తకాలను జనసేన మీడియా విభాగం నేడు హైదరాబాదులో పవన్ కల్యాణ్ కు అందించింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పార్టీ మీడియా విభాగం ప్రతినిధులను అభినందించారు.
అనంతరం పవన్ మాట్లాడుతూ, ఈ పుస్తకాలు తనకు ఎంతో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించాయని అన్నారు. ఈ ప్రస్థానంలో జనసేన పార్టీ ప్రజలతో ఎంతగా మమేకం అయిందీ, ప్రజాసేవకు ఏ విధంగా చిత్తశుద్ధితో అంకితమైందీ ఈ ఏడు సంకలనాలు తెలియజేస్తున్నాయని వివరించారు. పార్టీ సిద్ధాంతాలు, పార్టీ విధివిధానాలు, ప్రజాసమస్యలు, రాజకీయ, సామాజిక అంశాలపై చేసిన ప్రసంగాలను అక్షరబద్ధం చేయడం పార్టీ శ్రేణులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఈ పుస్తకాలు తనకు ఒక దిక్సూచిలా ఉన్నాయని అభివర్ణించారు. ప్రతి జిల్లాలో మాట్లాడినవి, స్థానిక సమస్యల నుంచి రాష్ట్ర స్థాయిలో సమస్యల వరకు ఏ విధంగా స్పందించామో ఈ పుస్తకాలు తెలియజేస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ మీడియా విభాగం ప్రతినిధులకు పేరుపేరునా ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్, మీడియా విభాగం ప్రతినిధులు చక్రవర్తి, ఎల్. వేణుగోపాల్ పాల్గొన్నారు.