Bhupesh Baghel: రాజ్యాంగంపై విశ్వాసం ప్రకటిస్తే.. నక్సల్స్‌తో చర్చలకు రెడీ: చత్తీస్‌గఢ్ సీఎం

Bhupesh Baghel says ready for talks with Maoists but on condition

  • షరతులతో కూడిన చర్చలకు తాము సిద్ధమని ఇటీవల ప్రకటించిన మావోలు
  • తాము కూడా సిద్ధమేనన్న ముఖ్యమంత్రి బఘేల్
  • బస్తర్ అయినా ఇంకెక్కడైనా తమకు ఓకే అన్న సీఎం

నక్సలైట్లతో శాంతి చర్చలకు తాము సిద్ధమేనని, కాకపోతే వారు రాజ్యాంగంపై పూర్తి విశ్వాసం ప్రకటించాల్సి ఉంటుందని చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ అన్నారు. సుక్మా జిల్లాలో నిన్న విలేకరులతో మాట్లాడిన సీఎం.. ప్రభుత్వంతో షరతులతో కూడిన చర్చలకు రెడీ అన్న మావోల ప్రకటనపై మాట్లాడుతూ.. చర్చలకు తామూ సిద్ధమేనని, అయితే వారు రాజ్యాంగం పట్ల విశ్వాసం ప్రకటించాలని అన్నారు. 

చర్చలకు బస్తర్ కంటే మంచి ప్రదేశం మరోటి ఉండదన్నారు. వారు చర్చలు జరపాలంటే కనుక తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. చత్తీస్‌గఢ్‌లో నక్సలిజం సుక్మా ప్రాంతంలోనే మొదలైందని, ఇక్కడి నుంచే వారి తిరోగమనం కూడా జరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. సుక్మానే కాదు, ఎక్కడైనా చర్చలకు రెడీయేనని స్పష్టం చేశారు. అయితే, వారు భారత రాజ్యాంగాన్ని విశ్వసించకపోతే చర్చలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

కాగా, జైళ్లలో ఉన్న తమ నేతలను విడుదల చేయడంతోపాటు కొన్ని ప్రాంతాల నుంచి భద్రతా బలగాలను ఉపసంహరించుకుంటే ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని ఇటీవల మావోలు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సీఎం బఘేల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఆ రాష్ట్ర హోం మంత్రి తామరద్వాజ్ సాహూ కూడా బేషరతు చర్చలకు సిద్ధమేనని ప్రకటించారు.

  • Loading...

More Telugu News