Lalu Prasad Yadav: లాలూపై సీబీఐ మరో కేసు నమోదు.. ఉదయం నుంచి లాలూ నివాసంతో పాటు 15 చోట్ల సోదాలు!
- 2004 నుంచి 2009 వరకు రైల్వే మంత్రిగా పని చేసిన లాలూ
- రైల్వే ఉద్యోగాల నియామకాలలో అవినీతికి పాల్పడ్డారని కేసు
- పాట్నాలో లేని లాలూ, తేజస్వి యాదవ్
పశుగ్రాసం కుంభకోణం కేసులో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. ఆయనకు ఊరట లభించి కొన్ని రోజులు కూడా గడవకుండానే మరో అవినీతి కేసులో లాలూపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. 2004 నుంచి 2009 వరకు రైల్యే మంత్రిగా ఉన్న సమయంలో రైల్వే ఉద్యోగాల నియామకాలలో అవినీతికి పాల్పడ్డారంటూ లాలూ, ఆయన భార్య రబ్రీదేవి, కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు మీసా భారతితో పాటు ఇతర కుటుంబ సభ్యులపై కేసు నమోదయింది.
ఈ కేసుకు సంబంధించి లాలూ నివాసంతో పాటు 15 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు ఈ ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. కేసు విషయానికి వస్తే... రైల్వే ఉద్యోగాలు ఇప్పించినందుకు గాను లాలూ, ఆయన కుటుంబ సభ్యులు భూములు, ఆస్తుల రూపంలో లంచాలు స్వీకరించారని వీరిపై అభియోగాలను మోపారు.
రూ. 139 కోట్ల దొరండా ట్రెజరీ స్కామ్ కేసులో ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో... 73 ఏళ్ల లాలూప్రసాద్ గత నెల జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు ప్రస్తుతం సీబీఐ సోదాలు జరుగుతున్న సమయంలో పాట్నాలోని నివాసంలో కేవలం రబ్రీదేవి మాత్రమే ఉన్నారు. లాలూ, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ పాట్నాలో లేరు. ఈ సోదాలపై ఆర్జేడీ నేత ముఖేశ్ రోషన్ మాట్లాడుతూ, లాలూ, తేజస్విలకు ఉన్న ప్రజల మద్దతును చూసి తట్టుకోలేకే అధికారంలో ఉన్నవారు వీరిని టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు.