Cannes: ఇదే మన నవ భారతం.. కేన్స్ వేదికగా ప్రధాని మోదీపై మాధవన్ ప్రశంసలు
- సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ విషయంలో ప్రధానిపై మాధవన్ పొగడ్తలు
- ప్రపంచమే అబ్బురపడేలా విజయం సాధించిందని వ్యాఖ్య
- రెండేళ్లలోనే అనుమానాలు పటాపంచలయ్యాయంటూ కామెంట్
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీపై సినీ హీరో ఆర్. మాధవన్ ప్రశంసల జల్లు కురిపించారు. దేశ సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతూ ప్రధాని నిర్ణయాన్ని కొనియాడారు. మైక్రో ఎకానమీని తీసుకొచ్చే మొదట్లో ప్రపంచం మొత్తం సందేహించిందని, పెద్ద విపత్తులా మారిపోతుందంటూ వ్యాఖ్యానించారని, కానీ, ఆ ప్రపంచమే ఇప్పుడు అబ్బుపడేలా సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ విజయం సాధించిందని చెప్పారు. ఆ అనుమానాలన్నీ రెండేళ్లలోనే పటాపంచలయ్యాయని, కథ మారిపోయిందని చెప్పుకొచ్చారు.
ప్రపంచంలో మైక్రో ఎకానమీకి సంబంధించి ఎక్కువ వినియోగదారులున్న దేశాల జాబితాలో భారత్ నిలిచిందన్నారు. అదే మన నవభారతమని పేర్కొన్నారు. ఓ రైతు ఫోన్ ను వాడాలంటే చదువే వచ్చి ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చారు. అంతా డిజాస్టర్ అవుతుందన్నారు. కానీ, ఇప్పుడేమైంది?’’ అని మాధవన్ పేర్కొన్నారు.