Pawan Kalyan: తెలంగాణలో పోటీకి సై అంటున్న పవన్ కల్యాణ్
- నల్గొండ జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన
- రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కార్యకర్త కుటుంబానికి చేయూత
- తెలంగాణలో పార్టీ కార్యకలాపాలపై స్పష్టమైన ప్రకటన
- ఇక నుంచి తెలంగాణలో జనసేన నేతలు తిరుగుతారని వెల్లడి
- వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టీకరణ
ఎనిమిదేళ్ల కిందట ఆవిర్భవించిన జనసేన పార్టీ ఇప్పటిదాకా ఏపీలోనే క్రియాశీలక రాజకీయాలు చేస్తోంది. ఇకపై తెలంగాణలోనూ జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని తాజాగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి పవన్ నేడు ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ భవిష్యత్ లక్ష్యాలను వివరించారు.
తనకు ఆంధ్ర జన్మనిస్తే, తెలంగాణ పునర్జన్మనిచ్చిందని అన్నారు. అదే బాధ్యతతో తెలంగాణలో రాజకీయాలు చేస్తామని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తాము తెలంగాణలోనూ పోటీ చేస్తున్నామని, అయితే ఎవరితో భాగస్వామ్యం ఉంటుంది, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్నది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళిక రూపొందించాల్సి ఉందని తెలిపారు.
తాను ఓడిపోయినా బాధ్యతతో రాజకీయాలు చేసే వ్యక్తినని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. ఓడిపోయాను కాబట్టే మరింత అనుభవం, బాధ్యతతో వచ్చానని స్పష్టం చేశారు. ఇక నుంచి జనసేన నేతలు తెలంగాణలోనూ సమస్యలు తెలుసుకుంటారని, ప్రతి నియోజకవర్గంలోనూ తిరుగుతారని వెల్లడించారు. తాను కూడా ప్రత్యేకంగా సమయం కేటాయించి తెలంగాణలో పర్యటనలు చేస్తానని వివరించారు. హైదరాబాదులో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తామని, తెలంగాణ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు అది వేదికగా నిలుస్తుందని చెప్పారు.
పార్టీ నిర్మాణం ఎంతో క్లిష్టతరమైన వ్యవహారం అని, ఏపీలోనూ నాలుగేళ్లు తిరిగి, అక్కడి పరిస్థితులు, సమస్యలు పరిశీలించి పార్టీ నిర్మాణం జరిపామని వెల్లడించారు. ఇకపై తెలంగాణ మీద కూడా ప్రత్యేక దృష్టి ఉంటుందని తెలిపారు. 25 ఏళ్ల భవిష్యత్తు అనేది తన నోటి నుంచి ఊరికే రాలేదని, అన్ని కోణాల నుంచి పరిశీలన తర్వాతే రాజకీయాల వైపు అడుగులు వేశానని వివరించారు.