Pawan Kalyan: 'తమ్ముడు' సినిమా సమయంలో జరిగిన ఒక సంఘటన నన్ను చాలా ప్రభావితం చేసింది: పవన్ కల్యాణ్
- తెలంగాణ రాజకీయాల్లోకి జనసేన ఎంట్రీపై పవన్ స్పష్టీకరణ
- వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని వెల్లడి
- తెలంగాణలో కొత్త నాయకత్వం రావాలని ఆకాంక్ష
- మార్పు తెచ్చే దిశగా తమ ప్రయాణం ఉంటుందన్న పవన్
జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ నల్గొండ జిల్లా పర్యటనకు విచ్చేశారు. సైదులు అనే కార్యకర్త రోడ్డు ప్రమాదంలో మరణించగా, అతడి కుటుంబానికి పవన్ కల్యాణ్ రూ.5 లక్షల ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, తాను రాజకీయాల వైపు అడుగులు వేయడానికి కారణమైన ఓ సంఘటనను వివరించారు.
"తమ్ముడు సినిమా సమయంలో ఓ సంఘటన జరిగింది. అది నాపై చాలా ప్రభావం చూపింది. తమ్ముడు సినిమా హిట్ కావడంతో ఫంక్షన్ చేద్దామని యూనిట్ సభ్యులు అన్నారు. అయితే, ఫంక్షన్ చేయడం కంటే ఆ డబ్బును నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ బాధితులకు అందజేస్తే బాగుంటుందని, ఫ్లోరైడ్ బాధితులున్న ఓ గ్రామాన్ని దత్తత తీసుకుందామని నేను ప్రతిపాదించాను. దాంతో మా సినిమా యూనిట్ వాళ్లు నా మాటకు విలువిచ్చారు.
కానీ స్థానిక నేతలు మాత్రం అంగీకరించలేదు. దాంతో నాలో అంతర్మథనం మొదలైంది. ప్రజలకు మేలు చేయాలంటే కచ్చితంగా రాజకీయ అండ ఉండాల్సిందేనన్న కృత నిశ్చయానికి వచ్చాను. అదే నన్ను రాజకీయాల దిశగా నడిపించింది. దానికోసమే 2007 నుంచి రాజకీయాల్లో ఉంటూ వచ్చాను. ఆపై తెలంగాణ గడ్డపైనే పార్టీ ప్రస్థానం మొదలుపెట్టాను" అని పవన్ కల్యాణ్ వివరించారు.
కాగా, తెలంగాణ ఎన్నికల్లో పోటీకి సంసిద్ధత తెలియజేసిన పవన్ కల్యాణ్ మరింత వివరణ ఇస్తూ... తెలంగాణలో తమకు ఎంతో అభిమాన బలం ఉందని వెల్లడించారు. తెలంగాణలో పూర్తి స్థాయిలో రాజకీయ బలం ఉందని చెప్పలేనని, అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ప్రభావితం చేసే స్థాయిలో ఓటు బ్యాంకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా 20 చోట్ల పోటీ చేయాలనేది తన ఆలోచన అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. దీనిపై పార్టీలో విస్తృతంగా చర్చించి, ఏ ఏ స్థానాల్లో పోటీ చేయాలన్నది నిర్ణయిస్తామని తెలిపారు. పొత్తులపైనా త్వరలోనే ఓ అవగాహనకు వస్తామని చెప్పారు.
తెలంగాణలో ఒక మార్పు తెచ్చే దిశగా తమ ప్రయాణం ఉంటుందని ఉద్ఘాటించారు. విద్యార్థులు, యువత తెలంగాణ తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారని, మళ్లీ నవ నాయకత్వం కోసం వారే అడుగులు వేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. వారసత్వ రాజకీయాల కంటే కొత్త నాయకత్వం తీసుకురావాలనేది జనసేన అభిమతం అంటూ తమ పోటీ ఎవరిపై ఉంటుందో పరోక్షంగా తెలియజేశారు.