Union Govt: పాంగోంగ్ సరస్సు వద్ద చైనా మరో వంతెన నిర్మిస్తోంది: కేంద్రం వెల్లడి
- సరిహద్దుల్లో చైనా అక్రమ నిర్మాణాలు
- గతంలో నిర్మించిన వంతెన పక్కనే మరో వంతెన
- కేంద్రం మౌనం వీడాలంటూ తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్
- ఎట్టకేలకు ప్రకటన చేసిన కేంద్రం
సరిహద్దుల్లో చైనా అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే కేంద్రం ఏంచేస్తోందంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. తూర్పు లఢఖ్ ప్రాంతంలో పాంగోంగ్ త్సో సరస్సుపై చైనా రెండో వంతెన నిర్మిస్తున్నది నిజమేనని వెల్లడించింది. ఇప్పటికే చైనా ఈ ప్రాంతంలో ఓ వంతెన నిర్మించిందని, ఇప్పుడు దాని పక్కనే మరో వంతెన నిర్మాణం చేపట్టిందని వివరించింది.
ఆక్రమించుకున్న భూభాగంలో చైనా నిర్మాణాలు చేపడుతోందని, ఇలాంటి అక్రమ నిర్మాణాలను భారత్ ఏమాత్రం సహించబోదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. చైనా చేసే అర్ధరహితమైన ఆరోపణలను తాము అంగీకరించబోమని ఉద్ఘాటించింది.
ప్రభుత్వం ఎప్పటికప్పుడు తాజా పరిణామాలు గమనిస్తూనే ఉంటుందని, భారతదేశ భద్రతకు భంగం వాటిల్లే పరిస్థితులను ఉపేక్షించేది లేదని, తగిన చర్యలు తీసుకుంటామని విదేశాంగ శాఖ ప్రతినిధి ఆరిందమ్ బాగ్జి ఓ ప్రకటనలో వెల్లడించారు.
.