Shoaib Akhtar: బాల్ వేగం కోసం తాను చేసిన అసాధారణ సాధన గురించి చెప్పిన షోయబ్ అక్తర్
- భుజాలతో వాహనాలు లాగిన పాక్ బౌలర్
- తొలుత చిన్న వాహనాలతో సాధన మొదలు పెట్టా..
- ఆ తర్వాత 5 మైళ్లపాటు ట్రక్ లాగడం సాధన చేశానన్న అక్తర్
ప్రపంచంలో మేటి ఫాస్ట్ బౌలర్లలో పాకిస్థాన్ కు చెందిన షోయబ్ అక్తర్ కూడా ఒకరు. అక్తర్ బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు కొందరు బ్యాట్స్ మెన్ భయపడే వారంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అటువంటి అక్తర్.. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ తన 20 ఏళ్ల క్రితం రికార్డును బ్రేక్ చేస్తే సంతోషిస్తానని ఇటీవలే ప్రకటన చేయడం గమనార్హం.
ఉమ్రాన్ మాలిక్ 155 కిలోమీటర్ల వేగంతో బంతులను సంధిస్తున్నాడు. కానీ, అక్తర్ మాత్రం 2003 ప్రపంచకప్ సందర్భంగా 161.3 కిలోమీటర్ల (100.23 మైల్స్) స్పీడ్ తో బంతిని వేసి ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. దీన్ని ఇప్పటి వరకు ఎవరూ బ్రేక్ చేయలేదు. ఈ రికార్డును ఉమ్రాన్ బ్రేక్ చేస్తే సంతోషిస్తానంటూ అక్తర్ ప్రకటించడం గమనార్హం.
‘‘155 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నావంటే.. నీ లోపల మరో 5 కిలోమీటర్ల సామర్థ్యం ఉంటుంది. ఈ అదనపు వేగాన్ని జోడించాలంటే అందుకు సాధన అవసరం. నేను 157-158 కిలోమీటర్ల వేగంతో ముందు బాల్ వేసే వాడిని. 160 కిలోమీటర్లు సాధ్యమయ్యేది కాదు’’ అని అక్తర్ వివరించాడు. వాహనాలను లాగడం వంటి కఠోర సాధనాలు చేసి, తన బౌలింగ్ వేగాన్ని పెంచుకున్నట్టు అక్తర్ తెలిపాడు.
‘‘టైర్లతో పరుగెత్తేవాడిని. కానీ, అవి తక్కువ బరువని అర్థమైంది. తర్వాత చిన్న వాహనాలను భుజానికి కట్టుకుని లాగేవాడిని. ఇస్లామాబాద్ లో జనసంచారం తక్కువగా ఉండేది. దాంతో రాత్రి వేళ వాహనాలను లాగేవాడిని. ఆ తర్వాత ట్రక్ ను లాగడం మొదలు పెట్టాను. ట్రక్ ను 4-5 మైళ్ల వరకు లాగేవాడిని’’ అని అక్తర్ వివరించాడు.