New Delhi: ఫేస్‌బుక్ లో జ్ఞానవాపి మసీదు గురించి పోస్టు చేసిన ప్రొఫెసర్ అరెస్టు
- ఢిల్లీ యూనివర్సిటీలోని హిందూ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ గా చేస్తోన్న రతన్ లాల్
- ఆయన చేసిన పోస్టుపై ఓ లాయర్ ఫిర్యాదు
- ఐపీసీ 153ఏ, 295ఏ కింద కేసు నమోదు
యూపీలోని వారణాసిలో జ్ఞానవాపి మసీదు కేంద్రంగా చోటు చేసుకుంటోన్న పరిణామాలపై ఇటీవల పలువురు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రాంగణంలో జ్యోతిర్లింగం ఉందని కూడా మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, ఇదే అంశంపై తాజాగా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినందుకు ఓ ప్రొఫెసర్ ను అరెస్టు చేయడం గమనార్హం.
ఢిల్లీ యూనివర్సిటీలోని హిందూ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ రతన్ లాల్ ను పోలీసులు గత రాత్రి అరెస్టు చేశారు. ఆయనపై ఐపీసీ 153ఏ, 295ఏ కింద కేసు నమోదయినట్లు ఢిల్లీ సైబర్ పోలీసులు తెలిపారు. ఫేస్‌బుక్‌లో జ్ఞానవాపి మసీదు గురించి ప్రొఫెసర్ రతన్ లాల్ చేసిన పోస్టు రెచ్చగొట్టే విధంగా ఉన్నట్లు ఢిల్లీ లాయర్ వినీత్ జిందాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.