Ukraine: ఉలిక్కిపడిన కేన్స్.. అత్యాచారాలు ఆపాలంటూ రెడ్ కార్పెట్ పై దుస్తులు విప్పేసిన ఉక్రెయిన్ మహిళ
- గట్టిగా అరుచుకుంటూ నినాదాలు
- వెంటనే స్పందించిన సెక్యూరిటీ
- వస్త్రాలు కప్పి బయటకు తీసుకెళ్లిన వైనం
ఉక్రెయిన్ లో రష్యా సైనికుల అరాచకాలు అన్నీఇన్నీ కావు. పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రపంచ దేశాలు యుద్ధం వద్దని వారిస్తున్నా రష్యా మాత్రం ఆపట్లేదు. రష్యా తీరుకు నిరసనగా కేన్స్ లో ఊహించని పరిణామం జరిగింది. రెడ్ కార్పెట్ మీద సినీ నటులు, హీరోయిన్లు, ప్రముఖుల సందడితో ఆహ్లాదంగా సాగుతున్న సినీ పండుగలో ఒక్కసారిగా ఉలికిపాటు కలిగింది.
ఉక్రెయిన్ కు చెందిన ఓ మహిళ రెడ్ కార్పెట్ పైకి వచ్చి.. తన ఒంటి మీదున్న దుస్తులను విప్పేసింది. ‘మాపై అత్యాచారాలు ఆపండి’ అంటూ ఒంటిపై ఆమె రాసుకొచ్చింది. ఉక్రెయిన్ జాతీయ పతాకాన్ని ఆమె తన ఒంటిపై వేసుకుంది. అంతేకాదు.. ఆమె తమపై అత్యాచారాలు ఆపాలంటూ నినదిస్తూ గళాన్నీ వినిపించింది.
వెనువెంటనే స్పందించిన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను బయటకు తీసుకెళ్లిపోయారు. ఒంటి మీద వస్త్రాలు కప్పారు. దీనిపై కేన్స్ అధికారిక బృందం ఇంకా ఎలాంటి స్పందనా తెలియజేయలేదు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉక్రెయిన్ కు సంఘీభావంగా ఆ దేశానికి చెందిన సినిమాలనూ ప్రదర్శిస్తున్నారు.