Rahul Gandhi: సొంత పార్టీపై కేంబ్రిడ్జ్ వర్సిటీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ
- లండన్ లో రాహుల్ గాంధీ
- కేంబ్రిడ్జి వర్సిటీలో ఐడియాస్ ఫర్ ఇండియా సదస్సు
- ఇతర విపక్షాల కంటే కాంగ్రెస్ పార్టీ గొప్పది కాదని వెల్లడి
- అనేక సమస్యలతో పోరాడుతున్నామని వివరణ
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లండన్ లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఐడియాస్ ఫర్ ఇండియా సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సొంత పార్టీ కాంగ్రెస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇతర విపక్షాల కంటే కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పది అని తాను అనుకోవడంలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని ఓ పెద్దన్నగా భావించడంలేదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అనేక విధాలుగా పోరాడుతోందని తెలిపారు. అంతర్గత కలహాలు, తిరుగుబాట్లు, లోపాలు, ఎన్నికల ఓటములు వంటి సమస్యలతో పోరాడుతున్నామని నిజాయతీగా వివరించారు.
"భారత్ లో పునరుజ్జీవం కోసం కాంగ్రెస్ శ్రమిస్తోంది. ఇదొక జాతీయస్థాయి సిద్ధాంతపరమైన యుద్ధం. గళం విప్పని ఆత్మ ఉన్నా లేనట్టే. ఆ దిశగా చూస్తే భారత్ గొంతుకను అణచివేశారు. పాకిస్థాన్ లో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయో భారత్ లోనూ చాలావరకు అలాంటి పరిస్థితులే ఉన్నాయి. మేం ఇప్పుడు పోరాడుతోంది ఒక్క బీజేపీతోనే కాదు... ఓ సంస్థ కబళించిన దేశ సంస్థాగత నిర్మాణం కోసం కూడా పోరాడుతున్నాం. నిధుల విషయంలో ఆ సంస్థతో మేం ఏ విధంగానూ పోటీపడలేం. అందుకే ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలపై భారీ ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపట్టాలని భావిస్తున్నాం" అని వివరించారు.