Kakinada: ఏపీ పోలీసులపై సుబ్రహ్మణ్యం భార్య సంచలన ఆరోపణలు.. వాయిస్ మెసేజ్ విడుదల
- పోస్టుమార్టానికి ఒప్పుకోవాలంటూ పోలీసులు ఒత్తిడి చేస్తున్నారన్న అనిత
- మహిళా కానిస్టేబుళ్లతో తనను కొట్టిస్తున్నారని ఆరోపణ
- ఈ మేరకు బంధువులకు వాయిస్ మెసేజ్ పంపిన అనిత
ఏపీవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మరణంపై కాకినాడలో శనివారం ఉదయం నెలకొన్న హైడ్రామా సాయంత్రం దాకా కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్సీ కారులో శవంగా కనిపించిన సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీనే హత్య చేశారని బాధితుడి కుటుంబం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేసేదాకా మృతదేహానికి పోస్టుమార్టం చేయనీయబోమంటూ బాధిత కుటుంబం అడ్డుకుంటోంది.
ఈ క్రమంలో ఏపీ పోలీసులపై సుబ్రహ్మణ్యం భార్య అనిత సంచలన ఆరోపణలు చేశారు. సుబ్రహ్మణ్యం మృతదేహం పోస్టుమార్టానికి అనుమతి ఇస్తూ సంతకం పెట్టాలని తనపై పోలీసులు ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఈ క్రమంలోనే మహిళా పోలీసులతో తనను కొట్టిస్తున్నారని ఆమె సంచలన ఆరోపణ చేశారు. ఈ మేరకు ఓ వాయిస్ మెసేజ్‌ను ఆమె తన కుటుంబ సభ్యులకు పంపింది. సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్ట్ మార్టం చేయడానికి ఒప్పుకోవాలంటూ అనితతో పాటు ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించిన సంగతి తెలిసిందే.