GVL Narasimha Rao: ఏపీలో పెట్రోలు, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయి.. కేంద్రంలా సీఎం జగన్ కూడా వ్యాట్ తగ్గించాలి: జీవీఎల్
- ఎక్సైజ్ సుంకం తగ్గించిన కేంద్రం
- తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- మోదీకి కృతజ్ఞతలు తెలిపిన జీవీఎల్
పెట్రోల్, డీజిల్ పై కేంద్రం భారీగా ఎక్సైజ్ సుంకం తగ్గించడంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని పెట్రోల్ పై రూ.8, డీజిల్ పై రూ.6 తగ్గించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. దీని కారణంగా రిటైల్ ధరలు పెట్రోల్ లీటర్ పై రూ.9.50, డీజిల్ లీటర్ పై రూ.7 తగ్గుతాయని జీవీఎల్ వివరించారు. 6 నెలల వ్యవధిలో రెండుసార్లు భారీగా తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించినందుకు మోదీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు వివరించారు.
అయితే, వైసీపీ ప్రభుత్వం వ్యాట్ ను విపరీతంగా పెంచడంతో ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని జీవీఎల్ ఆరోపించారు. ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ఏపీ సీఎం జగన్ కూడా కేంద్రం తరహాలోనే భారీగా వ్యాట్ ను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీజేపీ ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళుతుందని జీవీఎల్ హెచ్చరించారు.