Rohit Sharma: నాకు ఇవన్నీ కొత్తేం కాదు.. ఇలా జరగడం తొలిసారేం కాదు: రోహిత్ శర్మ
- తన పేలవ ఫాంపై స్పందన
- ఇక్కడితో ఏం అయిపోలేదని వెల్లడి
- మానసికంగా దృఢంగా ఉంటానని కామెంట్
- త్వరలోనే ఫాం అందుకుంటానని ధీమా
ఈ ఏడాది ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు అన్నీ చేదు అనుభవాలే. జట్టులోని టాప్ గన్స్ ఈసారి మెరవకపోవడం, బౌలింగ్ దళం ఆరంభ మ్యాచ్ లలో చేతులెత్తేయడంతో టోర్నీ నుంచి వైదొలిగిన తొలి జట్టుగా నిలిచింది. ఇక, జట్టు సారథి రోహిత్ శర్మ అడపాదడపా బ్యాటును ఝళిపించినా.. భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. నిన్న జరిగిన చివరి మ్యాచ్ లోనైతే మరీ ఘోరంగా విఫలమయ్యాడు. క్రీజులో చాలా ఇబ్బంది పడ్డాడు. చివరకు ఓ పేలవ షాట్ తో వికెట్ సమర్పించుకున్నాడు. మొత్తంగా 14 మ్యాచ్ లలో 19.14 సగటుతో కేవలం 268 పరుగులతో ఈ సీజన్ ను ముగించాడు.
తన పేలవ ఫామ్ పై రోహిత్ స్పందించాడు. ఆశావాద దృక్పథాన్ని కనబరిచాడు. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నాయని, వాటిని సరిచేసుకుంటున్నానని పేర్కొన్నాడు. తనకు ఇలా జరగడం ఇదే తొలిసారేం కాదని, ఇంతకుముందు కూడా ఇలాంటి దశలను ఎదుర్కొన్నానని గుర్తు చేశాడు.
‘‘చాలా విషయాలు నేను అనుకున్నట్టు జరగలేదు. అంతకుముందు కూడా చాలా సార్లు ఇలా జరిగింది. కాబట్టి నాకు ఇవన్నీ కొత్తేం కాదు. ఇక్కడితోనే అంతా ఏం అయిపోదు. ఇంకా చాలా క్రికెట్ ఆడాల్సి ఉంది. కాబట్టి నేను మానసికంగా ప్రశాంతంగా, దృఢంగా ఉండాలనుకుంటున్నా. మళ్లీ ఫాంలోకి రావడానికి, మంచి ప్రదర్శన చేయడానికి ఏం చేయాలనే దానిపైనే దృష్టి పెడతాను’’ అని చెప్పుకొచ్చాడు.
నిజంగా ఈ సీజన్ చాలా నిరాశపరిచిందని రోహిత్ అన్నాడు. ఆరంభంలో ప్రణాళికలను పక్కాగా అమలు చేయలేకపోయామన్నాడు. ఐపీఎల్ లాంటి టోర్నీల్లో అప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతుంటాయని, కాబట్టి వాటికి తగ్గట్టు సిద్ధం కావాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు. ఒకదాని తర్వాత మరొకటి ఓడిపోవడమంటే అది విపత్తేనని అన్నాడు.
తాము అనుకున్న ప్రణాళికలను మైదానంలోనూ అమలు చేశామని, కానీ, ఫలితం దక్కలేదన్నాడు. అయితే, కొత్త టీం ఉన్నప్పుడు ఇలాంటివి జరగడం సహజమని, కొందరు ఆటగాళ్లు తమ పాత్రల్లో ఒదిగిపోవడానికి, ఇక్కడి పరిస్థితులకు అడ్జస్ట్ కావడానికి సమయం పడుతుందని చెప్పాడు.