Sadhguru: చరిత్రను తిరగరాయలేం.. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో పరిష్కరించుకోవాలి: సద్గురు జగ్గీ వాసుదేవ్
- దండయాత్రల సమయంలో వేలాది ఆలయాలు ధ్వంసమయ్యాయన్న సద్గురు
- ఆ సమయంలో కాపాడుకోలేకపోయామని వ్యాఖ్య
- దానిపై ఇప్పుడు మాట్లాడం సరికాదన్న జగ్గీ వాసుదేవ్
దండయాత్రల సమయంలో ధ్వంసమైన వేలాది ఆలయాల గురించి ఇప్పుడు మాట్లాడడం సరైనది కాదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ అన్నారు. చరిత్రను తిరగరాయలేమని అభిప్రాయపడ్డారు. ‘‘ఆ సమయంలో వాటిని మనం కాపాడుకోలేదు. ఇప్పుడు వాటి గురించి మాట్లాడడం వివేకం అనిపించుకోదు’’ అని ఆయన పేర్కొన్నారు.
రెండు కమ్యూనిటీలు (హిందు, ముస్లిం) కలసి కూర్చుని కీలకమైన రెండు మూడు ప్రదేశాల గురించి మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని వాసుదేవ్ సూచించారు. ఒకే సమయంలో ఒక ఒకదాని గురించే మాట్లాడుకోవడం వల్ల వివాదం పరిష్కారం కాదని, శత్రుత్వ భావన తొలగిపోదన్నారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అదే మార్గమని సూచించారు.
భారత్ ఇప్పుడు కీలక మలుపు వద్ద ఉందన్నారు. ఈ సమయంలో సరైన విధంగా అడుగులు వేస్తే భారత్ ప్రపంచ శక్తిగా అవతరిస్తుందని జగ్గీ వాసుదేవ్ అభిప్రాయపడ్డారు. ప్రతి విషయాన్ని పెద్ద వివాదం చేసుకుని ఈ అవకాశాన్ని వృథా చేసుకోరాదన్నారు. మందిర్-మసీదు అంశాన్ని మీడియా సంస్థలు వివాదాస్పదం చేయవద్దని.. బదులుగా పరిష్కారం వైపు తీసుకెళ్లాలని సూచించారు. పరిష్కరించుకోలేని అంశం అంటూ ఏదీ లేదన్నారు.
హిందీ, దక్షిణాది రాష్ట్రాల భాషల మధ్య వివాదంపై వాసుదేవ్ స్పందిస్తూ.. ‘‘అన్ని భాషలకు భారత్ లో సమాన స్థానం ఉంది. హిందీ కంటే దక్షిణాది భాషలకు సాహిత్యం ఎక్కువ. భారత్ విభిన్నమైన దేశం’’ అని చెప్పారు.