Delhi NCR: ఢిల్లీలో గాలి.. వర్ష బీభత్సం
- తెల్లవారుజామున చల్లబడిన ఢిల్లీ
- గంటన్నర పాటు వర్షం
- పలు ప్రాంతాల్లో కూలిన చెట్లు
సోమవారం వేకువ జామున ఢిల్లీ వాసులను గాలి, వర్షం వణికించాయి. గంటన్నరపాటు ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలి తాకిడికి పలు చెట్లు నేలరాలి దారికి అడ్డంగా పడిపోయాయి. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సేవలకు విఘాతం ఏర్పడగా.. విద్యుత్ ప్రసారం కూడా నిలిచిపోయింది. ప్రయాణికులు తాజా సమాచారం కోసం తాము ప్రయాణించే విమాన సేవల సంస్థలను సంప్రదించాలని ఢిల్లీ విమానాశ్రయం సూచించింది. భానుడి భగభగలకు ఉడికిపోతున్న ఢిల్లీ ఒక్కసారిగా కూల్ గా మారిపోయింది. మరిన్ని వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
పలు ప్రాంతాల్లో చెట్లు పడిపోగా.. కొన్ని చోట్ల గోడలు కూలిపోయినట్టు ప్రాథమిక సమాచారం. 50-80 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులు వీస్తాయని, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని ఢిల్లీ వాసులకు సూచించింది. బలమైన గాలుల ప్రభావానికి బలహీనంగా ఉన్న నిర్మాణాలు కూలే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది.
తెల్లవారుజామున 5.40 గంటల సమయంలో ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్ ఉండగా.. వర్షం కారణంగా అది 11 డిగ్రీలకు పడిపోయింది. మళ్లీ ఉదయం 7 గంటలకు 18 డిగ్రీలకు పెరిగింది.