Electric Vehicles: ఎలెక్ట్రిక్ వాహనాలు కాలిపోతుండటానికి కారణం ఇదే: డీఆర్డీవో
- కాలి బూడిదవుతున్న విద్యుత్ ద్విచక్ర వాహనాలు
- భయాందోళనలకు గురవుతున్న వాహనదారులు
- బ్యాటరీలను, మాడ్యూల్ లను అన్ని ఉష్ణోగ్రతల వద్ద పరీక్షించకపోవడమే కారణమన్న డీఆర్డీవో
పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతుండటంతో వాహనదారులు ఎలెక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ వాహనాలు దగ్ధమవుతున్న ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఎలెక్ట్రిక్ వాహనాలను కొనాలంటేనే చాలా మంది భయపడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో విద్యుత్ వాహనాల్లో మంటలు చెలరేగడానికి గల కారణాలను డీఆర్డీవో ఒక నివేదికలో తెలిపింది.
బ్యాటరీ ప్యాక్, మాడ్యూల్ లను అన్ని ఉష్ణోగ్రతల వద్ద పరీక్షించకపోవడమే దీనికి కారణమని డీఆర్డీవో వెల్లడించింది. మరోవైపు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడం కోసం బ్యాటరీల తయారీలో తక్కువ నాణ్యత గల మెటీరియల్ ను వినియోగిస్తున్నట్టు వాహన తయారీ కంపెనీలపై ఆరోపణలు ఉన్నాయి. ఇంకోవైపు ప్రస్తుతం 2 శాతంగా ఉన్న ఎలెక్ట్రిక్ టూవీలర్ల వినియోగాన్ని 80 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.