Umran Malik: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ లో అందరి దృష్టి ఇతడిపైనే!

Umran Malik will be special attraction in T20 series against SA

  • ఐపీఎల్ లో విశేషంగా రాణించిన ఉమ్రాన్ మాలిక్
  • గంటకు 150 కిమీ పైగా వేగంతో బంతులు
  • 13 మ్యాచ్ ల్లో 21 వికెట్లు తీసిన వైనం
  • టీమిండియాకు ఎంపిక చేసిన సెలెక్టర్లు

ఉమ్రాన్ మాలిక్... ఐపీఎల్ తాజా సీజన్ లో మెరుపువేగంతో బౌలింగ్ చేస్తూ క్రికెట్ పండితులను సైతం విస్మయానికి గురిచేసిన సిసలైన ఫాస్ట్ బౌలర్. ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఉమ్రాన్ మాలిక్ విసిరిన ఓ బంతి 157 కిమీ వేగంతో దూసుకుపోవడం విశేషం. ఇది సీజన్ రికార్డుగా నిలిచింది. అంతేకాదు, ఉమ్రాన్ మాలిక్ వికెట్ల వేటలోనూ ముందు వరుసలో నిలిచాడు. 13 మ్యాచ్ ల్లో 21 వికెట్లు తీసిన సత్తా నిరూపించుకున్నాడు. ఓ మ్యాచ్ లో 25 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి తన అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. 

టాప్ క్లాస్ బ్యాట్స్ మెన్ సైతం అతడి పేస్ ను ఎదుర్కోలేకపోయారంటే అతిశయోక్తి కాదు. ఐపీఎల్ లో అతడి ప్రతిభను గుర్తిస్తూ టీమిండియా సెలెక్టర్లు జాతీయ జట్టుకు ఎంపిక చేయడం తెలిసిందే. జూన్ 9 నుంచి దక్షిణాఫ్రికాతో సొంతగడ్డపై జరిగే ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఉమ్రాన్ మాలిక్ తొలిసారి టీమిండియా క్యాప్ ధరించనున్నాడు. భారత జట్టుకు ఆడాలన్న అతడి కల ఎంతో త్వరగా నెరవేరినట్టే భావించాలి. 

22 ఏళ్ల ఉమ్రాన్ మాలిక్ దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడు. సఫారీ ఆటగాళ్లు అతడి బుల్లెట్ బంతులను ఏ విధంగా ఎదుర్కొంటారన్నది ఆసక్తి కలిగిస్తోంది. నిలకడగా 150 కిమీ పైచిలుకు వేగంతో బంతులు వేయడం మామూలు విషయం కాదు. కానీ, దృఢమైన శరీరం కలిగిన ఉమ్రాన్ మాలిక్... సన్ రైజర్స్ బౌలింగ్ డేల్ స్టెయిన్ శిక్షణలో తన బలానికి తగిన టెక్నిక్ కూడా జోడించి ఐపీఎల్ మ్యాచ్ ల్లో బ్యాట్స్ మెన్ తో న్యాటం చేయించాడు! ఫుల్ లెంగ్త్ బంతులు, యార్కర్లు, షార్ట్ పిచ్ బాల్స్, ఇన్ డిప్పింగ్ డెలివరీలతో మేటి బ్యాట్స్ మన్లను సైతం బోల్తా కొట్టించాడు. 

రవిశాస్త్రి వంటి క్రికెట్ దిగ్గజం కూడా ఉమ్రాన్ మాలిక్ లోని ప్రతిభను పసిగట్టాడు. అతడికి టీమిండియా సెంట్రల్ కాంట్రాక్టు ఇచ్చి మరింత ప్రోత్సహించాలని శాస్త్రి సూచించాడు. అయితే, అతడిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలని బీసీసీఐకి సలహా ఇచ్చాడు. 

అటు, మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ సైతం ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. ఉమ్రాన్ మాలిక్ ను టీ20 వరల్డ్ కప్ కు కూడా ఎంపిక చేయాలని తెలిపాడు. ఆస్ట్రేలియా గడ్డపై జరిగే ఆ టోర్నీలో మాలిక్ బంతుల్లో వేగానికి ఆటగాళ్ల తలలు పగలడం ఖాయమని పేర్కొన్నాడు. 

ఉమ్రాన్ మాలిక్ ను క్రికెట్ పండితులు షోయబ్ అక్తర్, బ్రెట్ లీ వంటి స్పీడ్ స్టర్ల కోవలో చేర్చుతున్నారు. గంటకు 160 కిమీ (100 మైళ్లు) వేగం బంతిని విసిరే సత్తా ఉన్న బౌలర్ ఉమ్రాన్ మాలిక్ అని అంటున్నారు. 

ఉమ్రాన్ మాలిక్ గత సీజన్ లో సన్ రైజర్స్ తరఫున కొన్ని మ్యాచ్ లు ఆడినా, ఓ మోస్తరు ప్రదర్శన కనబరిచాడు. అయితే అతడి పేస్ పై నమ్మకం ఉంచిన సన్ రైజర్స్ యాజమాన్యం అతడిని జట్టులో అట్టిపెట్టుకుంది. ఫ్రాంచైజీ నమ్మకాన్ని ఈ పండ్ల వ్యాపారి కొడుకు ఏమాత్రం వమ్ము చేయలేదు సరికదా, ఏకంగా టీమిండియాలో బెర్తు దక్కేలా అమోఘమైన ప్రదర్శన చేశాడు. 

కాగా, జమ్మూకశ్మీర్ నుంచి ఇప్పటివరకు ఏ ఒక్క ఆటగాడు కూడా టీమిండియా తరఫున టెస్టుల్లో ఆడలేదు. గతంలో పర్వేజ్ రసూల్ జాతీయ జట్టుకు ఎంపికైనా, పరిమితి ఓవర్ల క్రికెట్ తోనే సరిపెట్టుకున్నాడు. ఇప్పుడు ఉమ్రాన్ మాలిక్ ముందు మంచి అవకాశం నిలిచింది. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ లో గనుక రాణిస్తే, టీమిండియా టెస్టు జట్టులోనూ అతడికి స్థానం లభించడం తథ్యం.

  • Loading...

More Telugu News