YS Sharmila: మిమ్మల్ని యూనివర్సిటీల్లోకి అడుగు పెట్టనివ్వలేదని యూనివర్సిటీలను భ్రష్టు పట్టించాలని చూస్తున్నారా?: షర్మిల
- యూనివర్శిటీల్లో పాత కోర్సులకు కూడా ఎసరు పెడుతున్నారు
- 1,869 ప్రొఫెసర్ పోస్టులను ఖాళీగా పెట్టారు
- యూనివర్శిటీల్లో పోస్టులను భర్తీ చేసేందుకు కొట్లాడతాం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని యూనివర్శిటీలను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. మిమ్మల్ని యూనివర్శిటీలలోకి అడుగు పెట్టనివ్వడం లేదనే కోపంతో... యూనివర్శిటీలను భ్రష్టు పట్టించాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు.
యూనివర్శిటీల్లో కొత్త కోర్సులను పెట్టకపోగా... పాత కోర్సులకు ఎసరు పెడుతున్నారని అన్నారు. విశ్వవిద్యాలయాల్లో చదువు చెప్పే స్టాఫ్ ఉండకూడదనే దుర్మార్గపు ఆలోచనతో... కొత్త పోస్టులను భర్తీ చేయడం లేదని విమర్శించారు.
విద్యార్థులు చదువుకుంటే ప్రశ్నిస్తారు, ఉద్యోగాలు అడుగుతారనేనా యూనివర్శిటీలను ఆగం చేసేందుకు 1869 ప్రొఫెసర్ పోస్టులను ఖాళీగా పెట్టారని ప్రశ్నించారు. జనాలు మీరిచ్చే బర్లు, గొర్లు కాసుకోవాలని, హమాలీ పనులు చేసుకోవాలి... అందుకే చదువు అవసరం లేదని పోస్టులను భర్తీ చేయడం లేదా దొరా? అని ప్రశ్నించారు. గత 25 వారాలుగా నిరుద్యోగుల ఉద్యోగాల కోసం తాము కొట్లాడుతున్నామని... ఇకపై యూనివర్శిటీల్లో పోస్టులను భర్తీ చేసేందుకు కూడా కొట్లాడతామని అన్నారు.