Yogi Adityanath: యూపీలో ఈద్ నమాజు రోడ్డుపై చేపట్టకపోవడం ఇదే తొలిసారి: సీఎం యోగి ఆదిత్యనాథ్
- ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన యోగి
- ఇటీవల మతపరమైన ప్రదేశాల నుంచి లక్ష లౌడ్ స్పీకర్ల తొలగింపు
- స్కూళ్లకు, ఆసుపత్రులకు ఉచితంగా అందజేత
- యూపీలో అల్లర్లు లేవని వెల్లడి
ఇటీవల ఉత్తరప్రదేశ్ లో మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల తొలగింపును రాష్ట్ర సర్కారు యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం తెలిసిందే. అంతేకాదు, రోడ్లపై మతపరమైన ప్రార్థనలు, కార్యక్రమాలు నిర్వహించడంపైనా యోగి ఆదిత్యనాథ్ సర్కారు కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. యూపీలో తొలిసారిగా ఈద్ నమాజు, అల్విదా కార్యక్రమాలు ఎక్కడా రోడ్లపై జరగలేదని వెల్లడించారు.
అంతేకాదు, వివిధ మతపరమైన ప్రదేశాల నుంచి దాదాపు లక్షకు పైగా లౌడ్ స్పీకర్లను తొలగించడం జరిగిందని వివరించారు. ఆ లౌడ్ స్పీకర్లను ప్రజాసేవల నిమిత్తం స్కూళ్లకు, ఆసుపత్రులకు ఉచితంగా ఇచ్చేశామని తెలిపారు. యూపీ గతంలో చిన్న విషయాలకు కూడా అల్లర్లు జరిగే రాష్ట్రంగా ఉండేదని, ఇప్పుడా పరిస్థితి లేదని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. 2012 నుంచి 2017 మధ్య కాలంలో రాష్ట్రంలో 700కి పైగా అల్లర్లు చోటుచేసుకున్నాయని వివరించారు. పలు ప్రాంతాలు నెలల తరబడి కర్ఫ్యూలో ఉండేవని, ఇప్పుడా ప్రాంతాల్లో ఎలాంటి అల్లర్లు లేవని చెప్పారు.
ఆర్ఎస్ఎస్ పత్రికలు ఆర్గనైజర్, పాంచజన్య 75వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీలోని ప్రతి పౌరుడు, మహిళలు, చిన్నారులు తాము సురక్షితంగా ఉన్నట్టు భావిస్తున్నారని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత రాష్ట్రాల్లో ఘర్షణలు మామూలేనని, కానీ యూపీలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగాను, ఆ తర్వాత కూడా ఎలాంటి ఘటనలు జరగలేదని స్పష్టం చేశారు. శ్రీరామనవమి పండుగ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగిందని పేర్కొన్నారు.