Andhra Pradesh: ఎండలతో ఠారెత్తిపోతున్న కోస్తాంధ్ర.. విలవిల్లాడుతున్న జనం!
- పడమర నుంచి వీస్తున్న పొడిగాలులు
- వేడి గాలులతో నిప్పుల కుంపటిని తలపిస్తున్న వైనం
- శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు వడగాల్పుల ప్రభావం
- ఈ నెలాఖరు వరకు ఇంతేనంటున్న వాతావరణశాఖ
కోస్తాలో ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాల్పులు వీస్తుండడంతో బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. వేడిగాలుల కారణంగా కోస్తాంధ్రలోని చాలా ప్రాంతాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. పడమర నుంచి వీస్తున్న పొడిగాలులే ఇందుకు కారణమని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
నిన్న కోస్తాలోని నాలుగు మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 24 మండలాల్లో వడగాల్పులు వీచినట్టు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే, తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో 44.44, అనపర్తి, బిక్కవోలులో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెలాఖరు వరకు ఎండల తీవ్రత ఉంటుందని, 28 వరకు వడగాల్పుల ప్రభావం ఉంటుందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.