Nikhat Zareen: హిజాబ్ ను ధరించడంపై వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ స్పందన!
- హిజాబ్ ను ధరించడం వ్యక్తిగత అంశమన్న జరీన్
- తాను కూడా హిజాబ్ ను ఇష్టపడతానని వ్యాఖ్య
- హిజాబ్ విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్న జరీన్
ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు నిఖత్ జరీన్. తెలంగాణకు చెందిన ఈ అమ్మాయి ప్రపంచ బాక్సింగ్ వేదికపై మన దేశ త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా చేసింది. ఇస్తాంబుల్ లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ను సాధించి దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసింది. ఇస్తాంబుల్ నుంచి ఆదివారం ఆమె ఇండియాకు చేరుకుంది. హైదరాబాదులో ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఓపెన్ టాప్ వాహనంపై ఆమెను ఊరేగించారు.
మరోవైపు ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఇది ఆరంభం మాత్రమేనని చెప్పింది. పారిస్ ఒలింపిక్స్ లో దేశానికి పతకాన్ని సాధించడమే తన లక్ష్యమని తెలిపింది. అమ్మాయిలు వివిధ క్రీడల్లో మన దేశం గర్వించేలా చేస్తున్నారని చెప్పింది.
మరోవైపు దేశంలో చర్చనీయాంశంగా మారిన హిజాబ్ వస్త్రధారణపై ఆమె స్పందిస్తూ... హిజాబ్ ను ధరించడం అనేది వ్యక్తిగత అంశమని... దీనిపై తానేమీ వ్యాఖ్యానించలేనని తెలిపింది. వ్యక్తిగతంగా తాను కూడా హిజాబ్ ను ఇష్టపడతానని చెప్పింది. హిజాబ్ విషయంలో తనకు కానీ, తన కుటుంబానికి కానీ ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలిపింది. తన గురించి ఎవరు ఏమనుకుంటారో అనే విషయాన్ని తాను పట్టించుకోనని చెప్పింది. ఒకరి వేషధారణ పూర్తిగా వారి వ్యక్తిగతమని తెలిపింది.