newborn baby: సమాధి చేయడానికి ముందు.. శిశువులో కదలికలు!
- చనిపోయినట్టు చెప్పిన ఆసుపత్రి సిబ్బంది
- అంత్యక్రియలకు తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు
- శిశువు కదలడంతో తిరిగి ఆసుపత్రికి తరలింపు
- జమ్మూ కశ్మీర్ లో వెలుగు చూసిన ఘటన
అప్పుడే పుట్టిన శిశువు ప్రాణంతో లేదని చెప్పేసరికి కన్నతల్లిదండ్రులు కుదేలయ్యారు. బాధతో అంతిమ సంస్కారానికి తీసుకెళ్లారు. మట్టిలో కప్పి పెట్టడానికి (సమాధి) ముందు శిశువు కదలడం చూసి అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. ఇదంతా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే అని భావించి నేరుగా దవాఖానాకు వెళ్లి ఆందోళనకు దిగారు. జమ్మూ కశ్మీర్లోని రంబాన్ జిల్లా బనిహల్ ఉప జిల్లా ఆసుపత్రిలో ఇది చోటు చేసుకుంది.
బంకూట్ నివాసి అయిన బషరత్ అహ్మద్ భార్య ఆసుపత్రిలో శిశువుకు జన్మనిచ్చింది. కానీ, సిబ్బంది శిశువులో ప్రాణం లేదని చెప్పారు. దీంతో బేబీని శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అయితే, పూడ్చిపెట్టేముందు శిశువులో కదలికలను గమనించిన ఒకరు మిగిలిన వారికి చెప్పడంతో.. వారు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో అక్కడి సిబ్బంది ప్రత్యేక చికిత్స కోసం శ్రీనగర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు.
ఈ ఘటన విషయంలో ఆసుపత్రి నర్స్, స్వీపింగ్ కార్మికురాలిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. పోలీసులు తగిన చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు.