PM Modi: క్వాడ్ సదస్సులో ప్రధాని మోదీపై ప్రశంసలే ప్రశంసలు

PM Modis Covid vaccination efforts earn praises from Quad partners

  • కరోనా మహమ్మారిని గొప్పగా ఎదుర్కొన్నారంటూ అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా అభినందనలు
  • ప్రజాస్వామ్యం విజయం సాధించగలదని నిరూపించారన్న బైడెన్
  • భారత్-అమెరికా భాగస్వామ్యాన్ని సన్నిహితంగా మారుస్తామని ప్రకటన

భారత్, అమెరికా మధ్య భూమిపై అత్యంత సన్నిహిత భాగస్వామ్యం నెలకొల్పడానికి కట్టుబడి ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. జపాన్ రాజధాని టోక్యోలో క్వాడ్ సదస్సు సందర్భంగా జోబైడెన్, భారత ప్రధాని మోదీ చర్చలు నిర్వహించారు. ఇరు దేశాలు కలసికట్టుగా ఎంతో చేయాల్సి ఉందన్నారు. 

‘‘యూఎస్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ భారత్ లో వ్యాక్సిన్ల తయారీకి, శుద్ధ ఇంధనానికి సంబంధించిన చర్యలకు మద్దతు కొనసాగిస్తుంది. ఇందుకు వీలుగా ఒప్పందానికి వచ్చాం’’ అని బైడెన్ ప్రకటించారు. 

ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రభావాలు తగ్గించే విషయంలో భారత్ తో సంప్రదింపులు కొనసాగిస్తామని బైడెన్ చెప్పారు. భారత్-అమెరికా భాగస్వామ్యం విశ్వాసంతో కూడుకున్నదని మోదీ పేర్కొన్నారు. ఉమ్మడి ప్రయోజనాలు, విలువలు ఈ విశ్వసనీయ బంధాన్ని బలోపేతం చేసినట్టు చెప్పారు. 

క్వాడ్ సదస్సులో ప్రధాని మోదీ పనితీరుకు పెద్ద ఎత్తున అభినందనలు లభించాయి. కరోనా విపత్తును ఎదుర్కోవడం, దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలకు టీకాలు ఇవ్వడాన్ని ప్రస్తావించారు. కరోనా మహమ్మారిని ప్రజాస్వామ్యబద్ధంగా గొప్పగా ఎదుర్కొన్నారని అమెరికా అధ్యక్షుడు బైడెన్, జపాన్ ప్రధాని పుమియో కిషిద, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ప్రశంసించారు. 

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భారత్ విజయం సాధించిందని.. అంతే జనాభా కలిగిన చైనా విఫలమైనట్లు బైడెన్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు విజయం సాధించగలవని మోదీ ప్రపంచానికి చాటి చెప్పినట్టు వ్యాఖ్యానించారు. భారత టీకాలు క్షేత్రస్థాయి పరిస్థితుల్లో ఎంతో మార్పును తీసుకొచ్చాయని అల్బనీస్ అన్నారు.

  • Loading...

More Telugu News