restaurants: రెస్టారెంట్లలో సర్వీసు చార్జీ ఐచ్ఛికమే.. కట్టక్కర్లేదన్న కేంద్ర ప్రభుత్వం

Centre warns restaurants over service charges convenes meet over it

  • నిబంధనలకు విరుద్ధమని గుర్తు చేసిన కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ
  • జూన్ 2న రెస్టారెంట్ల జాతీయ సంఘంతో సమావేశం ఏర్పాటు
  • ఈ అంశంపై చర్చించనున్నట్టు ప్రకటన

రెస్టారెంట్లకు వెళితే తిన్న ప్రతి పదార్థానికి చార్జీతోపాటు విడిగా సర్వీస్ చార్జీ కూడా వేశారేమో? చూసుకోండి. ఎందుకంటే సర్వీసు నచ్చితేనే ఆ చార్జీ ఇవ్వొచ్చు. లేదంటే ఇవ్వక్కర్లేదు. ఇది ఐచ్ఛికమేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. రెస్టారెంట్లు మాత్రం ప్రతి కస్టమర్ నుంచి వసూలు చేస్తున్నాయి. దీనిపై రెస్టారెంట్లను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.

నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ)తో జూన్ 2న కేంద్ర ప్రభుత్వం ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఈ మేరకు ఒక లేఖను రెస్టారెంట్ల సంఘానికి రాశారు. ‘‘సర్వీసు చార్జీలన్నవి కస్టమర్ల విచక్షణకు సంబంధించినవి. స్వచ్ఛందమే కానీ తప్పనిసరి కాదు’’ అంటూ ప్రభుత్వ గత ఆదేశాల సారాంశాన్ని గుర్తు చేశారు. 

కస్టమర్లు అందరి నుంచి సర్వీసు చార్జీలు వసూలు చేస్తుండడంతో.. ఇది వినియోగదారుల హక్కులపై పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తున్నట్టు రోహిత్ కుమార్ పేర్కొన్నారు. దీన్ని నిశితంగా పరిశీలించాల్సి ఉందన్నారు. సర్వీసు చార్జీలు చెల్లించని వారిని వేధింపులకు గురి చేస్తున్న అంశాన్ని కూడా ప్రస్తావించారు. 2017లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల కింద.. కస్టమర్లను సర్వీసు చార్జీ చెల్లించాలంటూ వేధించడం చట్ట విరుద్ధం. రెస్టారెంట్లు సాధారణంగా 10 శాతం వరకు బిల్లు మొత్తంపై సర్వీసు చార్జీ కింద రాబడుతుంటాయి.

  • Loading...

More Telugu News