Vangalapudi Anitha: సీన్ రివర్స్ అవడంతో నేడు అంబటి, రోజా రంగంలోకి దిగారు: వంగలపూడి అనిత
- మాజీ డ్రైవర్ ను చంపిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు
- మంత్రుల స్పందనపై అనిత విమర్శలు
- ఎమ్మెల్సీని బర్తరఫ్ చేయాలని విజ్ఞప్తి
మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపింది తానే అని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించడం తెలిసిందే. అంతకుముందు బొత్స స్పందిస్తూ, అనంతబాబు ఎలాంటి తప్పు చేయలేదేమో... అందుకే ధైర్యంగా బయట తిరుగుతున్నాడు అని వ్యాఖ్యానించారు. కాకినాడ ఎస్పీ ప్రెస్ మీట్ అనంతరం మరో మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ... ఎమ్మెల్సీ అనంతబాబు హత్య కేసులో ఇరుక్కున్నాడని, చట్టప్రకారం వెళ్లాలని సీఎం చెప్పారని వెల్లడించారు. తప్పు చేస్తే శిక్ష తప్పదని అన్నారు.
ఈ నేపథ్యంలో, టీడీపీ తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పందించారు. నిన్నటివరకు బొత్స వంటి మంత్రులు హంతకుడైన ఎమ్మెల్సీని వెనకేసుకొచ్చారని వెల్లడించారు. సీన్ రివర్స్ అవడంతో నేడు అంబటి, రోజా రంగంలోకి దిగారని విమర్శించారు. జగన్ రెడ్డి నిజంగా న్యాయం వైపే ఉంటే హంతకుడ్ని బర్తరఫ్ చేయించరెందుకు? అని ప్రశ్నించారు. దళితబిడ్డను పాశవికంగా హింసించి చంపిన ఎమ్మెల్సీని బర్తరఫ్ చేయాలని మండలి చైర్మన్ కు విన్నపం అంటూ వంగలపూడి అనిత ట్విట్టర్ లో పేర్కొన్నారు.