Arvind Kejriwal: పంజాబ్ సీఎం నిబద్ధత చూసి కళ్లలో నీళ్లు తిరిగాయి: కేజ్రీవాల్
- పంజాబ్ లో అవినీతి మంత్రిపై వేటు
- ఆరోగ్యమంత్రిని అరెస్ట్ చేసిన ఏసీబీ
- ఆప్ ను చూసి దేశం గర్విస్తోందన్న కేజ్రీవాల్
పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే ఓ అవినీతి మంత్రిని గుర్తించి అతడిపై వేటు వేయడం సంచలనం సృష్టించింది. అభివృద్ధి పనుల నుంచి తనకు వాటా ఇవ్వాలని, ప్రతి టెండరు నుంచి 1 శాతం కమీషన్ ఇవ్వాలంటూ పంజాబ్ ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లా అవినీతికి తెరలేపిన విషయాన్ని సీఎం భగవంత్ మాన్ బట్టబయలు చేశారు.
అంతేకాదు, సింగ్లాపై కేసు నమోదు చేయాలంటూ ఏసీబీకి సిఫారసు చేశారు. ఆయనను మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగిస్తున్నట్టు ప్రకటించారు. సీఎం సిఫారసు నేపథ్యంలో ఏసీబీ అధికారులు అవినీతి మంత్రి విజయ్ సింగ్లాను అరెస్ట్ చేశారు.
ఈ పరిణామాలపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అవినీతి విషయంలో ఏమాత్రం ఉపేక్షించకుండా, మంత్రిని సైతం తొలగించిన సీఎం భగవంత్ మాన్ నిబద్ధత తనను కదిలించి వేసిందని, కళ్లలో నీళ్లు తిరిగాయని పేర్కొన్నారు. "భగవంత్... నీ పట్ల గర్విస్తున్నాను. ఆప్ ను చూసి ఇవాళ దేశమంతా గర్విస్తోంది" అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.