GVL Narasimha Rao: అంబేద్కర్ పై అంత గౌరవం ఉంటే.. నవరత్నాలకు ఆయన పేరు పెట్టుకోండి: జీవీఎల్ నరసింహారావు

YSRCP hand is there in Konaseema violence says GVL Narasimha Rao

  • కోనసీమ ఘటనలో వైసీపీ భాగస్వామ్యం ఉంది
  • ఒక ప్రణాళిక ప్రకారమే కోనసీమ హింస జరిగింది
  • హిందూ వ్యతిరేక విధానాలను వీడండి

జిల్లా పేరును బీఆర్ అంబేద్కర్ కోనసీమగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో... కోనసీమ రగిలిపోతోంది. ప్రశాంతంగా ఉండే అమలాపురంలో నిన్న చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు దేశ వ్యాప్తంగా కల్లోలం రేపాయి. ఏకంగా ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే ఇళ్లను ఆందోళనకారులు అగ్నికి ఆహుతి చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై మండిపడ్డారు. 

కోనసీమలో జరిగిన హింసాత్మక ఘటనలను ఖండిస్తున్నామని జీవీఎల్ అన్నారు. అంబేద్కర్ పేరును వైసీపీ ప్రభుత్వం రాజకీయాల్లోకి లాగడం దారుణమని చెప్పారు. ఒక ప్రణాళిక ప్రకారమే కోనసీమ హింస జరిగిందని అన్నారు. ఒక మంత్రికే ఇలా జరిగిందంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అందరూ అర్థం చేసుకోవచ్చని చెప్పారు. కోనసీమ ఘటనలో వైసీపీ భాగస్వామ్యం ఉందని అన్నారు. 

ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ దారుణానికి ఒడిగట్టారని చెప్పారు. అంబేద్కర్ మీద అంత అభిమానం ఉంటే నవరత్నాలకు అంబేద్కర్ పేరు పెట్టొచ్చుకదా అని అన్నారు. జిన్నా టవర్స్ పేరు మార్చాలని కోరితే తమ నేతలను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. హిందూ వ్యతిరేక విధానాలను వీడాలని... లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News