Konaseema: కోన‌సీమ నిందితులను గుర్తించాకా.. అప్పుడుంటది బాదుడే బాదుడు: స్పీక‌ర్ త‌మ్మినేని

ap speaker tammineni sitaramcomments on konaseema clashes
  • కోన‌సీమ అల్ల‌ర్లు బాధాకరమన్న స్పీకర్ తమ్మినేని 
  • జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెట్టడం నూటికి కోటి శాతం కరెక్టని వ్యాఖ్య  
  • జిల్లాలకు మహనీయుల పేర్లు పెడితే తప్పేంటని నిలదీత 
  • అల్లర్ల వెనుక ఎవరున్నారో త్వరలో తెలుస్తుందన్న త‌మ్మినేని
కోన‌సీమ జిల్లా అమ‌లాపురంలో చోటుచేసుకున్న అల్ల‌ర్ల‌పై ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం సీరియ‌స్‌గా స్పందించారు. 'ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డ నిందితుల‌ను గుర్తించాక అప్పుడుంట‌ది బాదుడే బాదుడు' అంటూ ఆయ‌న ఆస‌క్తిక‌రంగా స్పందించారు. ఈ మేర‌కు శ్రీకాకుళంలో బుధ‌వారం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో త‌మ్మినేని మాట్లాడారు. కోన‌సీమ అల్ల‌ర్లు బాధాకరమని విచారం వ్య‌క్తం చేసిన తమ్మినేని సీతారాం.. కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెట్టడం నూటికి కోటి శాతం కరెక్ట‌ని వ్యాఖ్యానించారు. 

జిల్లాలకు మహనీయుల పేర్లు పెడితే తప్పేంటి? అని త‌మ్మినేని ప్రశ్నించారు. అంబేద్కర్‌ రాజ్యాంగం అనుభవిస్తూ ఆయన పేరును వ్యతిరేకిస్తారా? అని ఆయ‌న నిల‌దీశారు. కులాలు, మతాలు, జాతుల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడం మంచిది కాదని ఆయ‌న‌ మండిపడ్డారు. 

అమలాపురం అల్లర్ల వెనుక ఎవరున్నారో త్వరలో తెలుస్తుందని, కుట్ర వెనుక దాగి ఉన్న నిందితులను గుర్తించాకా.. అప్పుడుంటది బాదుడే బాదుడు అని స్పీకర్ వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లాకు అంబేద్కర్ 2 జిల్లాగా పేరు పెట్టమనండి, ఏ రాజకీయ పార్టీ అడ్డుకుంటుందో చూస్తాన‌ని కూడా ఆయ‌న అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే రాష్ట్రంలో సామాజిక న్యాయం జరిగిందని తమ్మినేని పేర్కొన్నారు.
Konaseema
Amalapuram
AP Speaker
Tammineni Sitaram

More Telugu News