IPL 2022: వర్షం వల్ల ఆలస్యంగా ఎలిమినేటర్ మ్యాచ్... టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న లక్నో
- ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్
- టాస్ గెలిచి బెంగళూరుకు బ్యాటింగ్ ఇచ్చిన లక్నో జట్టు
- ఆ మ్యాచ్‌లో ఓడితే ఇక సిరీస్ నుంచి అవుటైనట్టే
- గెలిచిన జట్టుకు దక్కనున్న మరో అవకాశం
ఐపీఎల్లో లీగ్ దశ ముగిసిన నేపథ్యంలో జరుగుతున్న ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల్లో భాగంగా బుధవారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కావాల్సిన ఎలిమినేటర్ మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఫీల్డింగ్‌ను ఎంచుకుని ప్రత్యర్థి జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఫస్ట్ బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మరికాసేపట్లో ఈ బెంగళూరు జట్టు తన ఇన్నింగ్స్‌ను ప్రారంభించనుంది.
14 సీజన్లుగా టైటిల్ కోసం వేచి చూస్తున్న బెంగళూరు జట్టు ప్రస్తుతం జరుగుతున్న 15వ సీజన్లో ఓ మోస్తరు ప్రదర్శనను కనబరచింది. ఈ క్రమంలోనే మరింత మేర సత్తా చాటి తొలి టైటిల్ చేతబట్టాలని ఆ జట్టు ఉత్సాహంగా ఉంది. అదే సమయంలో అరంగేట్రం చేసిన తొలి సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ మాదిరిగా లక్నో జట్టు కూడా అదరగొట్టే ప్రదర్శనతో రాణించింది.
ఇక ఈ మ్యాచ్‌లో నెగ్గి టైటిల్ రేసులో నిలవాలన్న కసితో కేఎల్ రాహుల్ బృందం పట్టుదలగా వుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టైటిల్ వేట నుంచి తప్పుకోవాల్సి ఉండగా.. గెలిచిన జట్టుకు ఎలిమినేటర్ 2 మ్యాచ్ ఆడే అవకాశాలుంటాయి. ఇక విశ్లేషకుల అంచనా మేరకు, ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు కంటే లక్నో జట్టుకే విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.