Eluru: జగన్, సజ్జల, గౌతం సవాంగ్‌లపై చింతమనేని ప్రైవేట్ కేసు
- ఏలూరు కోర్టులో చింతమనేని ప్రైవేట్ కేసు దాఖలు
- పలువురు పోలీసు అధికారులపైనా చర్యలకు డిమాండ్
- ఆందోళనలు,టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనడమే నేరమా? అంటూ ప్రశ్న
- రెండేళ్ల వ్యవధిలోనే 25 కేసులు పెట్టారన్న చింతమనేని
అక్రమ కేసులు నమోదు చేస్తూ తనను ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపిస్తూ టీడీపీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ డీజీపీ గౌతం సవాంగ్‌లపై ప్రైవేట్ కేసు నమోదు చేయాలంటూ కోర్టును కోరారు.
కేవలం రెండేళ్ల వ్యవధిలోనే తనపై ఏకంగా 25 కేసులు నమోదు చేశారని చింతమనేని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ఆందోళనలు చేపట్టడం, టీడీపీ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడమే నేరమన్నట్లుగా కేసులు నమోదు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ పెద్దలతో పాటు పోలీసు అధికారులు రాహుల్ దేవ్‌శర్మ, నవజ్యోత్ సింగ్ గ్రేవాల్, కృష్ణారావు, నలుగురు సీఐలు, ముగ్గురు ఎస్సైలపై కూడా ఆయన ప్రైవేట్ కేసు దాఖలు చేశారు.