Chandrababu: పిచ్చివేషాలు వేస్తే తోక కత్తిరించి పంపుతాం: వైసీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్

Chandrababu warns YCP leaders ahead of TDP Mahanadu
  • ఒంగోలులో రెండ్రోజుల పాటు మహానాడు
  • మంగళగిరి నుంచి బయల్దేరిన చంద్రబాబు
  • చిలకలూరిపేట వద్ద ప్రసంగం
  • పనికిమాలిన చిల్లర సీఎం అంటూ వ్యాఖ్యలు
  • వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమన్న బాబు  
రేపు, ఎల్లుండి ఒంగోలులో టీడీపీ మహానాడు జరగనున్న నేపథ్యంలో, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మంగళగిరి నుంచి ర్యాలీగా బయల్దేరారు. ఒంగోలుకు చేరుకునే క్రమంలో చిలకలూరిపేట వద్ద పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలకు ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. మహానాడును అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

"ఒంగోలులో మా సభకు మైదానం ఇవ్వరా? మా ఫ్లెక్సీలు చించేస్తారా? మహానాడును మేమేమీ అడ్డుకోవడం లేదని ఓ మంత్రి అంటున్నాడు. మహానాడును ఆపగలమని మీరు అనుకుంటున్నారా? టీడీపీ మహానాడు ఓ ప్రభంజనం. నాకు కోపం వస్తే ఎవరిని వదిలేది లేదు. పిచ్చివేషాలు వేయకుండా మీరు మర్యాదగా ఉంటే సరి... లేకపోతే తోకలు కత్తిరించి పంపుతాం" అంటూ చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. 

ఒంగోలులో నిర్వహించే మహానాడుకు టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ కట్టలు తెంచుకుని రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏ వర్గం సంతృప్తికరంగా లేదని, క్విట్ జగన్-సేవ్ ఆంధ్రప్రదేశ్ కు మహానాడు ద్వారా పిలుపునిద్దామని చంద్రబాబు ఉద్ఘాటించారు. టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిందని, 1994లోనూ ఇంత ఉత్సాహం లేదని అన్నారు. 

అయితే, టీడీపీ శ్రేణులను కేసులతో భయపెట్టాలని చూస్తున్నారని, ఎంతోమంది సీఎంలను చూశానని, కానీ ఇటువంటి పనికిమాలిన చిల్లర సీఎంను మాత్రం చూడలేదని వ్యాఖ్యానించారు. వైసీపీ అరాచకాలకు చక్రవడ్డీతో కలిపి చెల్లించడం ఖాయమని చంద్రబాబు హెచ్చరించారు. టీడీపీ శ్రేణులకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఏ క్షణం ఎన్నికలు జరిగినా జగన్ కు ఓటమి తప్పదని అన్నారు.
Chandrababu
TDP Mahanadu
Ongole
YSRCP
Andhra Pradesh

More Telugu News