Chandrababu: దద్దమ్మ పాలన వల్ల ఏపీ పరువు పోయింది: మహానాడులో చంద్రబాబు ఫైర్

AP spoiled in one sadist ruling says Chandrababu in Mahanadu
  • ఒక ఉన్మాది పాలన ఏపీకి శాపంగా పరిణమించిందన్న బాబు 
  • పన్నులు, ధరలతో ప్రజలను బాదేస్తున్నారని విమర్శ 
  • అమ్మ ఒడి అన్నారు.. నాన్న బుడ్డీ పెట్టారని వ్యగ్యం 
ఒక ఉన్మాది పాలన ఏపీకి శాపంగా పరిణమించిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచక పాలనను కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. కబ్జాలు, దోపిడీలు పెరిగిపోయాయని దుయ్యబట్టారు. చేతకాని దద్దమ్మ పాలన వల్ల ఏపీ పరువు మొత్తం పోయిందని విమర్శించారు. ఒంగోలులో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహానాడు అంటే గుర్తొచ్చేది ఎన్టీఆర్ అని... ఇది తెలుగువారి పండుగ అని అన్నారు. తెలుగుదేశం వెనుకబడిన తరగతుల పార్టీ అని చెప్పారు. 

వైసీపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా మాట్లాడిన టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి, అరెస్ట్ చేశారని... టీడీపీ కార్యకర్తలు అరెస్ట్ అయినప్పుడల్లా తాను నిద్రలేని రాత్రులను గడిపానని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దోచుకోవడం తప్ప వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని... ప్రతి దాంట్లో బాదుతున్నారని అన్నారు. సరఫరా చేయని కరెంట్ పై కూడా బాదుడే బాదుడని అన్నారు. చెత్తపై, డ్రైనేజీపై, పెట్రోల్ పై ఇలా ప్రతి దానిపై జనాలను బాదుతున్నారని మండిపడ్డారు. పన్నులు, ధరలతో బాదేస్తున్నారని చెప్పారు. ఇసుక, సిమెంట్ ధరలను పెంచేశారని అన్నారు. సిమెంట్ ధరలు పెరగడంతో నిర్మాణరంగం దెబ్బతిన్నదని చెప్పారు. రాష్ట్రంలో నిత్యావసరాలు కొనలేని పరిస్థితి ఉందని అన్నారు.  

ఏపీలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని చంద్రబాబు అన్నారు. వైసీపీ నేతలు కరుడుగట్టిన నేరస్తులని అన్నారు. నిలదీస్తే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. కేసులకు, లాఠీలకు భయపడమని చెప్పారు. జగన్ పాలనలో సంక్షేమం అనేది ఒక బూటకమని చెప్పారు. అమ్మ ఒడి అన్నారు.. నాన్న బుడ్డీ పెట్టారని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని అన్నారు. పెట్రోల్ ధరలను కేంద్రం తగ్గించినా.. రాష్ట్రం తగ్గించడం లేదని విమర్శించారు.
Chandrababu
Telugudesam
TDP Mahanadu
Jagan
YSRCP

More Telugu News