Tamilisai Soundararajan: యోగా శారీరకంగా, మానసికంగా ఫిట్ గా ఉంచుతుంది: గవర్నర్ తమిళిసై
- ఎల్బీ స్టేడియంలో యోగా మహోత్సవ్ నిర్వహణ
- యోగా చేయడం ద్వారా నిత్య యవ్వనంగా ఉండొచ్చన్న గవర్నర్
- బీపీ వంటి వాటిని దూరంగా ఉంచుతుందన్న తమిళిసై
ప్రస్తుత బిజీ జీవితంలో అందరూ తీరిక లేకుండా గడుపుతున్నారు. శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోవడంతో అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. చిన్న వయసులోనే వృద్ధుల మాదిరి తయారవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక సూచనలు చేశారు. యోగా చేయడం ద్వారా నిత్య యవ్వనంగా ఉండొచ్చని ఆమె అన్నారు. ఈరోజు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన యోగా మహోత్సవ్ లో తమిళిసై పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ యోగా వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు. యోగా మనల్ని శారీరకంగా, మానసికంగా ఫిట్ గా ఉంచుతుందని తెలిపారు. బీపీ వంటి వాటిని దూరంగా ఉంచుతుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా 190కి పైగా దేశాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. వీటిలో ముస్లిం దేశాలు కూడా ఉన్నాయని చెప్పారు. దేశంలోని ప్రతి వ్యక్తి యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. మరోవైపు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సర్బానంద సోనోవాల్, ఎమ్మెల్యే రాజాసింగ్, సినీ నటులు మంచు విష్ణు, సందీప్ కిషన్, నిర్మాత దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.