YSRCP: దావోస్ నుంచి జగన్ తిరుగు ప్రయాణం... ఏపీకి రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించిన సీఎం!
- 5 రోజుల పాటు సాగిన దావోస్ సదస్సు
- గురువారంతో ముగిసిన సదస్సు
- భారీ పెట్టుబడులు సాధించిన సీఎం జగన్
- గ్రీన్ ఎనర్జీ రంగంలోనే అధిక పెట్టుబడులు
ఏపీకి పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా దావోస్‌లో ఈ నెల 22 నుంచి 5 రోజుల పాటు జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులకు హాజరైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం దావోస్ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నెల 22 నుంచి 26 వరకు దావోస్ సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు 17 మందితో కూడిన ప్రతినిధి బృందాన్ని వెంట తీసుకెళ్లిన జగన్... ఆ బృందానికి తానే నేతృత్వం వహించారు.
5 రోజుల పాటు జరిగిన సదస్సులో బిజీబిజీగా గడిపిన సీఎం జగన్... పలు కంపెనీల ప్రతినిధులతో భేటీలు నిర్వహించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం వ్యవస్థాపకుడు క్లాస్ స్వాబ్‌తోనూ ఆయన భేటీ అయ్యారు. గ్రీన్ ఎనర్జీ కేంద్రంగా రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే దిశగా జగన్ యత్నించారు. ఈ దిశగా జగన్ యత్నాలు ఫలించి రాష్ట్రానికి రూ.1.25 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వంతో ఆయా సంస్థల ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు.