Venkatesh: మూవీ రివ్యూ: 'ఎఫ్ 3'

F3 Movie Review

  • ఈ రోజునే విడుదలైన 'ఎఫ్ 3'
  • కథాకథనాల్లో లోపించిన ఆసక్తి 
  • పాటల్లో కనిపించని పస 
  • కలిసి నడవలేకపోయిన కామెడీ .. రొమాన్స్ 
  • 'ఎఫ్ 2'ను దాటలేకపోయిన 'ఎఫ్ 3'

వెంకటేశ్ - వరుణ్ తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో కొంతకాలం క్రితం వచ్చిన 'ఎఫ్ 2' విడుదలైన ప్రతి ప్రాంతంలోను నవ్వుల సందడి చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి అనూహ్యమైన స్పందన రావడంతో, వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేసింది. 

అలాంటి ఆ సినిమాకి సీక్వెల్ గా 'ఎఫ్ 3' సినిమాను రూపొందించారు. కొత్తగా సునీల్ ను .. అలీని తీసుకుని కామెడీ వైవు నుంచి డోస్ పెంచారు. ఇక సోనాల్ చౌహాన్ .. పూజ హెగ్డేను అదనంగా చేర్చుకుని అందాల సందడిని చేయించారు.

దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా 'ఎఫ్ 2'ని మించి ఉంటుందని అనిల్ రావిపూడి చెప్పాడు. ఆయన చెప్పినదాంట్లో నిజమెంతనేది ఇప్పుడు చూద్దాం.

వెంకీ (వెంకటేశ్) ఫ్యామిలీ చాలా పెద్దది. మధ్యతరగతి కుటుంబం కావడంతో అందరి అవసరాలు తీర్చలేక నానా తంటాలు పడుతుంటాడు. వరుణ్ (వరుణ్ తేజ్) అనాథ. సెటిల్మెంట్లు చేస్తూ ఉంటాడు. వెంకీకి రేచీకటి అయితే .. వరుణ్ కి నత్తి. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంటుంది. ఇద్దరూ కూడా చాలా తేలికగా ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశాల కోసం అన్వేషిస్తూ ఉంటారు. 

ఇక మరో వైపున హారిక (తమన్నా) హానీ (మెహ్రీన్) ఇద్దరు అక్కా చెల్లెళ్లు కూడా సాధ్యమైనంత త్వరగా శ్రీమంతులు కావడానికి దగ్గర దారులు వెతుకుతుంటారు. ఆ అక్కా చెల్లెళ్ల మాయలోపడి వెంకీ - వరుణ్ అప్పుల పాలవుతారు. దాంతో గొడవ పోలీస్ స్టేషన్ వరకూ వెళుతుంది.

అందరినీ కూల్ చేసిన ఎస్. ఐ. నాగరాజు (రాజేంద్ర ప్రసాద్)  తాను నిజాయతీతో పట్టుకున్న కోట్ల రూపాయల డబ్బు .. విలువైన డైమండ్స్ తన బాస్ (సంపత్ రాజ్) దగ్గర ఉన్నాయనీ, తామంతా కలిసి అవి కొట్టేసి వచ్చినదంతా సమానంగా పంచుకుందామని చెబుతాడు. ఆ ఆపరేషన్ ను అంతా కలిసి సక్సెస్ చేస్తారు. అయితే పోలీసుల తనిఖీకి భయపడి వాళ్లు పాతకార్ల షెడ్డులో ఉన్న ఒక కారులో ఆ బ్యాగును దాస్తారు. ఆ తరువాత వెళ్లి తీసుకుందామని చూస్తే అక్కడ ఆ డబ్బు - డైమండ్స్ ఉండవు. మరో వైపున నాగరాజు బాస్ కి నిజం తెలిసిపోయి, తనకి అవి తిరిగి అప్పగించడానికి వారం గడువు ఇస్తాడు. 

అదే సమయంలో పదేళ్ల వయసులో పారిపోయిన తన కొడుకు ఎక్కడ ఉన్నా తిరిగిరావాలనీ, అతని కోసం 20 ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని విజయనగరానికి చెందిన ఆనంద్ ప్రసాద్ అనే శ్రీమంతుడు (మురళీశర్మ) చేసిన వీడియోను వీళ్లంతా చూస్తారు. ఆయన కొడుకును తానేనంటూ ఒకరికి తెలియకుండా ఒకరు వెంకీ ... వరుణ్ .. వెన్నెల కిశోర్ .. అబ్బాయి గెటప్ లో తమన్నా విజయనగరంలోని ఆనంద్ ప్రసాద్ ప్యాలెస్ లో దిగిపోతారు. 

మరి, పాతకారులో దాచిన డబ్బు .. డైమండ్స్ ఏమయ్యాయి? ఆనంద్ ప్రసాద్ ప్యాలెస్ లో జరిగే దాగుడుమూతలు ఎలాంటివి? ఆయన అసలు కొడుకు ఎవరు? అనే దిశగా కథ అనేక ఆసక్తికరమైన మలుపులు తిరుగుతూ ఉంటుంది.

ఆరంభంలో ఇటు హైదరాబాదులో ... అటు విజయనగరంలో నడిచిన ఈ కథ, విశాంత్రి తరువాత పూర్తిగా విజయనగరానికి చేరుకుని, ఆనంద్ ప్రసాద్ ప్యాలెస్ కేంద్రంగా నడుస్తుంది. అనిల్ రావిపూడి చెప్పినట్టుగానే ఈ కథ డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఆ డబ్బుకోసం ఆయా పాత్రలు పడే ఆరాటం .. ఆ పాత్రల మేనరిజమ్స్ .. బలహీనతలు అక్కడక్కడ సరదాగా నవ్విస్తాయి. 

అయితే, కథ మొదలై మెహ్రీన్ పాత్ర లైన్లో పడేవరకూ కామెడీ అందుకోదు. అలాగే హారిక మాయలో వెంకీ పడేవరకూ పుంజుకోదు. డబ్బు కోసం ఒక్కో పాత్ర ప్యాలెస్ కి చేరుకునేవరకూ సందడిగానే సాగుతుంది. అసలు కొడుకు ఎవరో తెలుసుకోవడానికి ఆనంద్ ప్రసాద్ పెట్టే పరీక్షలు .. క్లైమాక్స్ సన్నివేశాలు గందరగోళంగా అనిపిస్తాయి. 

ఈ సినిమాలో కామెడీ పాళ్లు పెంచడానికి తీసుకున్న సునీల్ .. అలీ, గ్లామర్ కోటింగ్ పెంచడానికి రంగంలోకి దింపిన సోనాల్,  పూజ హెగ్డే వలన ఒరిగిందేమీ లేదు. పురుష గెటప్ లో ఉన్న తమన్నా పై సోనాల్ మనసు పారేసుకోవడం .. వాళ్లిద్దరి మధ్య పాట పెట్టడం గమ్మత్తుగా అనిపిస్తుంది. 

'ఎఫ్ 2'లో కథ .. కథనాలు .. పాత్రలను తీర్చిదిద్దిన తీరు .. పాటలు ఆ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించాయి. ఈ సినిమా విషయానికి వచ్చేసరికి, ప్రతి సీన్ లో ఆడియన్స్ తో నవ్వించడానికి అనిల్ రావిపూడి చేసిన ప్రయత్నం ఆశించిన స్థాయిలో ఫలించలేదనే చెప్పాలి. 'ఊ ఆ అహ అహ' మినహా దేవిశ్రీ పాటలు కూడా పెద్ద గొప్పగా ఏమీ లేవు. పాత్రలు ఎక్కువైపోయి .. కామెడీ కంటే ఎక్కువగా హడావిడి కనిపిస్తుంది. 

'ఎఫ్ 2' లో వెంకటేశ్ - తమన్నా భార్యా భర్తలు. వరుణ్ తేజ్ - మెహ్రీన్ కొత్త దంపతులు. ఈ సినిమాలో ఆ బంధాలను కంటిన్యూ చేయిస్తే బాగుండేది. తమ విలాసాల కోసం ఎక్కువ డబ్బు సంపాదించమని వాళ్లు భర్తలను పోరుపెడితే .. ఆ డబ్బు కోసం వీళ్లు దారితప్పినట్టుగా చూపిస్తే కథ రక్తి కట్టేది. కానీ సినిమాలో వెంకటేశ్ .. తమన్నా .. వరుణ్ .. మెహ్రీన్ మధ్య ఫస్టు సినిమా తాలూకు సంబంధాలు ఏమీ ఉండకపోవడం .. మళ్లీ ఒకరిని లైన్లో పెట్టడానికి మరొకరు ట్రైచేయడం ఆడియన్స్ ను అయోమయానికి గురిచేస్తాయి. ప్రీ క్లైమాక్స్ వరకూ ఎలాగో అలా నడుస్తూ వచ్చిన కామెడీ ఆ తరువాత జారిపోయి ... ఎటువైపో వెళ్లిపోయి .. ఏదో అయిపోతుంది. 

వెంకటేశ్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. వరుణ్ తేజ్ కూడా ఆయనతో పాటు కామెడీని పరికిగెత్తించడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. తమన్నా తన గ్లామర్ ఎంతమాత్రం తగ్గలేదని ఈ సినిమాతో మరోసారి నిరూపించింది. మిగతా హీరోయిన్స్ ఆమె ముందు తేలిపోయారు. 

మెహ్రీన్ .. అన్నపూర్ణ  .. వై. విజయ పాత్రలకు గతంలో మాదిరి ప్రాధాన్యత దక్కలేదనే చెప్పాలి. ఈ  సినిమాలో విలన్ అంటూ ప్రత్యేకించి ఎవరూ ఉండరు  .. ఒకరిని ఒకరు మోసం చేసుకోవడంతోనే కథ నడుస్తూ ఉంటుంది. కెమెరా పనితనం .. ఎడిటింగ్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉన్నాయి. 'ఎఫ్ 2' ను మించిన ఫన్ ను 'ఎఫ్ 3' ఇస్తుందని అనిల్ రావిపూడి చెప్పినప్పటికీ, దీనికంటే 'ఎఫ్ 2' నే బాగుందనే అభిప్రాయంతోనే థియేటర్లలో నుంచి ఆడియన్స్ బయటికి వస్తారని చెప్పచ్చు. 

---- పెద్దింటి గోపీకృష్ణ

  • Loading...

More Telugu News