- చంద్రబాబును సీఎం చేసేందుకు ప్రతి కార్యకర్త కదం తొక్కాలన్న అచ్చెన్న
- 160 సీట్లతో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారంటూ వ్యాఖ్య
- టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన వారి తాట తీసేలా చంద్రబాబు పాలన ఉంటుందన్న అచ్చెన్న
ఒంగోలులో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రారంభోపన్యాసం చేశారు. ఈ మహానాడుకు ఒక ప్రత్యేకత ఉందని, టీడీపీ పుట్టి 40 ఏళ్లు పూర్తయిందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఈ ఏడాది టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ శత జయంతి కూడా కావడం వల్ల ఈ మహానాడు చాలా ప్రత్యేకమైనదని అన్నారు. తమ అధినేత చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి కార్యకర్త కదం తొక్కాలని పిలుపునిచ్చారు. టీడీపీ అంటే కేవలం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే రాజకీయం చేసే పార్టీ కాదని... అధికారం లేకపోయినా ప్రజల మధ్య ఉండే పార్టీ అని చెప్పారు.
ఈ మూడేళ్ల వైసీపీ పాలనలో తాము పడిన కష్టం గత 40 ఏళ్లలో ఎప్పుడూ పడలేదని అచ్చెన్నాయుడు అన్నారు. దుర్మార్గమైన ముఖ్యమంత్రి జగన్ వల్ల పార్టీకి చెందిన జాతీయ స్థాయి నేతల నుంచి కార్యకర్తల వరకు అందరూ ఇబ్బందులు పడ్డారని చెప్పారు. టీడీపీ అంటే గాలికి పుట్టిన పార్టీ కాదని... ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన పార్టీ అని అన్నారు. టీడీపీ లేకుండా చేయడం నీకు, నీ తండ్రికి, నీ తాతకు ఎవరికీ సాధ్యం కాదని వ్యాఖ్యానించారు.
గత మూడేళ్లలో టీడీపీ నాయకులను, కార్యకర్తలను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారి తాట తీసేలా రాబోయే చంద్రబాబు పాలన ఉంటుందని అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక టీడీపీ కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను, రౌడీషీట్ లను ఒక్క సంతకంతో కొట్టేస్తారని చెప్పారు.
వైసీపీ పాలనలో భయపడ్డ కార్యకర్తలకు చంద్రబాబు చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమం ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని తెలిపారు. చంద్రబాబు పర్యటనలకు ఉత్తరాంధ్రకు మించి రాయలసీమలో స్పందన వచ్చిందని చెప్పారు. వచ్చే ఎన్నికలలో 160 స్థానాలతో చంద్రబాబు సీఎం అవుతారని జోస్యం చెప్పారు. వైసీపీ మంత్రులు చేపట్టిన బస్సు యాత్రలో అలీబాబా 40 దొంగలు ఉన్నారని ఎద్దేవా చేశారు. బలహీన వర్గాలు టీడీపీకి చేరువవుతున్నాయనే భయంతోనే వైసీపీ బస్సు యాత్రను చేపట్టిందని అన్నారు.