Nara Lokesh: పొత్తుల విషయం ఎన్నికలప్పుడే మాట్లాడాల్సిన అంశం: నారా లోకేశ్
- టీడీపీ మహానాడు తొలిరోజున పలు నిర్ణయాలు
- కీలక ప్రతిపాదన చేసిన లోకేశ్
- వరుసగా రెండుసార్లు పదవులు చేపట్టినవారికి విరామం
- ఆ లెక్కన తాను మూడుసార్లు పనిచేశానని వెల్లడి
- ఈ నిర్ణయం తనతోనే అమలు అని ఉద్ఘాటన
తెలుగుదేశం పార్టీ మహానాడులో తొలిరోజు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. రెండు పర్యాయాలు ఒకే పదవిలో కొనసాగిన వారికి విరామం ఇవ్వాలని భావిస్తున్నామని, అది తనతోనే మొదలుపెడతామని తెలిపారు. తాను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడుసార్లు పనిచేశానని, ఈసారి పార్టీ ఎన్నికల్లో పాల్గొనబోనని స్పష్టం చేశారు. పార్టీ జనరల్ సెక్రటరీగా కొత్తవారికి అవకాశం ఇస్తానని పేర్కొన్నారు. పార్టీలో సుదీర్ఘకాలం పదవుల విధానం రద్దు చేయాలన్న ప్రతిపాదనను మహానాడులో తానే ప్రవేశపెట్టినట్టు లోకేశ్ వెల్లడించారు.
అంతేకాకుండా, వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు ఎలాంటి రాజకీయ నేపథ్యంలేని యువతకు కేటాయిస్తామని ఉద్ఘాటించారు. పార్టీ కోసం పనిచేసిన చాలామంది యువకులు ఉన్నారని, వారిని పార్టీ గుర్తిస్తుందని భరోసా ఇచ్చారు.
ఇక, ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన పొత్తుల అంశంపైనా లోకేశ్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. పొత్తుల విషయం ఎన్నికలప్పుడే మాట్లాడాల్సిన అంశమని తేల్చేశారు. ప్రస్తుతం తమ దృష్టి అంతా జగన్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేయడంపైనే ఉందని వివరించారు.