PM Modi: బాపు, పటేల్ కలల సాకారానికి పనిచేశాం.. ప్రజలు సిగ్గు పడే పని ఒక్కటీ చేయలేదు: ప్రధాని మోదీ
- పేదలకు మద్దతుగా నిలిచామన్న మోదీ
- సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొన్నామని వెల్లడి
- గుజరాత్ ఫైల్స్ ను అప్పట్లో కేంద్రం ఆమోదించేది కాదని విమర్శ
- తాను ఈ స్థాయిలో ఉండడానికి గుజరాతే కారణమన్న ప్రధాని
ఎనిమిదేళ్ల పాలనలో మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కలలు కన్న భారత్ నిర్మాణానికి పనిచేసినట్టు ప్రధాని మోదీ పేర్కొన్నారు. పేదలు, దళితులు, గిరిజనులు, మహిళలు సాధికారత సాధించాలని బాపూజీ కోరుకున్నట్టు గుర్తు చేశారు. గుజరాత్ లోని రాజ్ కోట్ లో శనివారం జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు.
జన్ ధన్ యోజన పథకం ప్రజలకు ఉపయోగపడినట్లు ఈ సందర్భంగా చెప్పారు. రైతులు, కార్మికుల జన్ ధన్ ఖాతాల్లో నేరుగా నగదు డిపాజిట్ చేసినట్టు తెలిపారు. కరోనా, యద్ధ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొన్నామని, ఎక్కడా రాజీ పడలేదని గుర్తు చేశారు. పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను సరఫరా చేయడంతోపాటు.. ప్రజలు అందరికీ ఉచిత టీకాలు అందించామన్నారు. ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రజల ప్రయత్నాలు తోడైనప్పుడు సేవ చేసే బలం పెరుగుతుందన్నారు.
నేడు తాను ఈ స్థాయిలో ఉండడానికి గుజరాతే కారణమని ప్రధాని మోదీ ప్రజల సమక్షంలో ప్రకటించారు. అందుకు ధన్యవాదాలు తెలియజేశారు. గుజరాత్ ప్రజలు సిగ్గు పడే పని ఒక్కటీ చేయలేదన్నారు. గత యూపీఏ సర్కారు తీరును ఈ సందర్భంగా ప్రధాని ఎండగట్టారు.
‘‘నేను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు యూపీఏ సర్కారు ఫైళ్లకు ఆమోదం తెలిపేది కాదు. గుజరాత్ కోసం ప్రాజెక్టులకు వారు ఆమోదం తెలియజేయలేదు. గుజరాత్ ఫైల్స్ ను బ్లాక్ చేసి నన్ను ద్వేషించారు’’ అని గత అనుభవాలను ప్రజలతో పంచుకున్నారు. ప్రధాని స్వరాష్ట్రమైన గుజరాత్ లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ దృష్ట్యా బీజేపీ అక్కడ మరోసారి అధికారం నిలబెట్టుకునే దిశగా ప్రచార కార్యక్రమాలను షురూ చేసింది.