Priest: దుష్టశక్తులను తరిమివేస్తానంటూ మహిళలను కొరడాతో తాట లేచిపోయేట్టు కొట్టిన పూజారి!
- తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో ఘటన
- నరైకినర్ గ్రామంలో ఉత్సవాలు
- భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలు
- పూజారి చేతిలో కొరడా దెబ్బలు తిన్న మహిళలు
వందల కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో అంధవిశ్వాసాలకు కొదవలేదు. సాంకేతిక విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ ఆధునిక యుగంలోనూ ప్రజల్లో మూఢ నమ్మకాలు మాత్రం తొలగిపోలేదు. అందుకు ఈ ఘటనే నిదర్శనం. తమిళనాడులోని నమక్కల్ జిల్లాలోని సరైకినర్ అనే ఊర్లో ఇటీవల గ్రామోత్సవాలు నిర్వహించారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత నిర్వహిస్తున్న వేడుకలు కావడంతో సమీపంలోని 18 గ్రామాల వారు కూడా విచ్చేశారు.
నరైకినర్ గ్రామంలోని వరదరాజపెరుమాళ్ చెల్లియమ్మన్ మారియమ్మన్ ఆలయంలో వేడుకల సందర్భంగా పూజారి పూనకం వచ్చినట్టు ఊగిపోయాడు. ఓ కొరడా తీసుకుని మహిళలను తాట ఊడి వచ్చేట్టు కొట్టాడు. ఆ విధంగా కొట్టడం అక్కడి ఆచారం. పూజారి కొరడాతో కొడితే క్షుద్రశక్తులు పారిపోతాయని అక్కడి వారి నమ్మిక. దాంతో పెద్ద ఎత్తున మహిళలు ముందుకొచ్చి పూజారితో కొరడా దెబ్బలు తిన్నారు.