Sasikala: శశికళతో బీజేపీ నాయకురాలు విజయశాంతి రహస్య భేటీ.. భవిష్యత్ రాజకీయ ప్రయాణంపై చర్చ!
- భవిష్యత్ రాజకీయ ప్రయాణంపై విజయశాంతితో చర్చించిన శశికళ
- బీజేపీ వ్యూహంలో భాగంగానే శశికళతో విజయశాంతి భేటీ!
- తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశమైన భేటీ
తెలంగాణకు చెందిన బీజేపీ నాయకురాలు విజయశాంతి, జయలలిత నెచ్చెలి శశికళ మధ్య రహస్య భేటీ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా శశికళ తన భవిష్యత్ రాజకీయ ప్రయాణంపై విజయశాంతితో చర్చించినట్టు సమాచారం. 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అన్నాడీఎంకే నుంచి బయటకు వెళ్లిపోయిన వారిని తిరిగి పార్టీలో చేర్పించే యత్నాల్లో బీజేపీ ఉందని, అందులో భాగంగానే శశికళతో విజయశాంతి భేటీ అయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా, గతంలో శశికళ జైలు నుంచి విడుదలైన తర్వాత విజయశాంతి ఆమెను కలిశారు. ఇప్పుడు మరోమారు ఇద్దరూ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, జైలు నుంచి విడుదలయ్యాక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, ఇకపై ఆధ్యాత్మిక జీవితం గడపాలని నిర్ణయించుకున్నట్టు అప్పట్లో శశికళ ప్రకటించారు. అందులో భాగంగా ఆధ్యాత్మిక యాత్ర పేరుతో రాష్ట్రంలోని ఆలయాలను సందర్శించారు.
అయితే, ఈ సందర్భంగా పలుచోట్ల ఆమెను కలిసిన మద్దతుదారులు తిరిగి రాజకీయాల్లోకి రావాలని కోరడంతో ఆమె మనసు మార్చుకున్నారు. మళ్లీ రాజకీయ ప్రయాణం ప్రారంభిస్తానని అప్పట్లో చెప్పారు. అన్నాడీఎంకేకు తిరిగి సారథ్యం వహించాలని చాలామంది నేతలు తనను కోరినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు విజయశాంతితో భేటీ కావడం తమిళ రాజకీయాల్లో హీట్ పెంచింది.