India: భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా.. చైనాతో తగ్గిన భారత లావాదేవీలు
- గత ఆర్థిక సంవత్సరం వాణిజ్యం విలువ రూ.9.28 లక్షల కోట్లు
- అంతకుముందు రూ.6.25 లక్షల కోట్లు
- చైనాతో తగ్గిన వాణిజ్య లావాదేవీలు
- రూ.6.71 లక్షల కోట్ల వాణిజ్యం
భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా అవతరించింది. చైనాను దాటేసి అగ్రరాజ్యం ముందంజ వేసింది. 2021–2022 ఆర్థిక సంవత్సరంలో చైనాతో పోలిస్తే అమెరికాతోనే భారత వాణిజ్య కలాపాలు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్–అమెరికా మధ్య 11,942 కోట్ల డాలర్ల (సుమారు రూ.9.28 లక్షల కోట్లు) వాణిజ్యం జరిగింది. అదే సమయంలో అంతకుముందు ఏడాది ఆ వాణిజ్య కలాపాల విలువ 8,051 కోట్ల డాలర్లుగానే (సుమారు రూ.6.25 లక్షల కోట్లు) ఉండేది.
అమెరికాకు ఎగుమతులు 5,162 కోట్ల డాలర్ల (సుమారు రూ.4.01 లక్షల కోట్లు) నుంచి 7,611 కోట్ల డాలర్లకు (సుమారు రూ.5.91 లక్షల కోట్లు) పెరిగాయి. దిగుమతులు కూడా అదే స్థాయిలో పెరిగాయి. 2,900 కోట్ల డాలర్లు (సుమారు రూ.2.25 లక్షల కోట్లు)గా ఉన్న దిగుమతులు.. గత ఆర్థిక సంవత్సరంలో 4,331 కోట్ల డాలర్లకు (సుమారు రూ.3.36 లక్షల కోట్లు) పెరిగాయి.
చైనా విషయానికొస్తే ఆ దేశంతో భారత వాణిజ్య విలువ 11,542 కోట్ల డాలర్లు (సుమారు రూ.8.96 లక్షల కోట్లు)గా ఉండగా.. గత ఆర్థిక సంవత్సరం ఆ విలువ 8,640 కోట్ల డాలర్ల (సుమారు రూ.6.71 లక్షల కోట్ల)కు పడిపోయింది.
కాగా, అమెరికాతో వాణిజ్య సంబంధాలు మున్ముందు మరింత బలపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచంలోని చాలా సంస్థలు చైనాపై ఆధారపడడం తగ్గించుకుంటున్నాయని, ఈ నేపథ్యంలోనే వారికి భారత్ ఒక విశ్వసనీయ వాణిజ్య భాగస్వామిగా ఎదుగుతోందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ పోర్ట్ ఆర్గనైజేషన్స్ ఉపాధ్యక్షుడు ఖాలిద్ ఖాన్ అన్నారు.
అమెరికా నేతృత్వంలోని ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ వర్క్ (ఐపీఈఎఫ్)లో భారత్ చేరిందని, తద్వారా అమెరికా–భారత్ మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలపడే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు.
వాస్తవానికి 2013–14 నుంచి 2017–18 వరకు చైనానే భారత్ కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఏకచ్ఛత్రాధిపత్యాన్ని కొనసాగించింది. ఆ తర్వాత కరోనా కారణంగా ఒక సంవత్సరం దెబ్బపడినా.. మళ్లీ 2020–2021లో తన స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. అయితే, ఇప్పుడు అమెరికాను దాటి ముందుకెళ్లలేకపోయింది. చైనాకు ముందు మనకు యూఏఈ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉండడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో యూఏఈతో భారత వాణిజ్య విలువ 7290 కోట్ల డాలర్లు (సుమారు రూ.5.66 లక్షల కోట్లు) కావడం విశేషం. అమెరికా, చైనా తర్వాత భారత్ తో ఎక్కువ వాణిజ్యం జరిపిన మూడో దేశం యూఏఈనే.