Aadhar: ఆధార్ జిరాక్స్ కాపీలపై ప్రకటనను ఉపసంహరించుకున్న కేంద్రం
- మాస్క్‌డ్ కాపీలనే వినియోగించాలని కేంద్రం ప్రకటన
- నిమిషాల వ్యవధిలోనే వైరల్ అయిన ప్రకటన
- దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన వ్యతిరేకత
- ప్రకటనను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్రం వెల్లడి
- ఆధార్ కార్డుల గోప్యతను ఆధార్ ఐడెంటిటీ అథెంటికేషన్ ఎకో సిస్టమ్ రక్షిస్తుందని వివరణ
ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలను ఇతరులకు సమర్పించే సమయంలో జాగ్రత్తలు పాటించాలంటూ జారీ చేసిన ప్రకటనను కొన్ని గంటలు గడవకముందే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఆదివారం ఉదయం జారీ చేసిన ప్రకటనను మధ్యాహ్నానికే ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించడం గమనార్హం.
ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలను ఇతరులకు అందించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ఎవ్వరికి పడితే వారికి ఆధార్ జిరాక్స్ కాపీలను ఇవ్వవద్దని, వ్యక్తులకుగానీ, సంస్థలకుగానీ ఇవ్వకూడదని, ఇస్తే వాటిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంటుందని కేంద్రం ఆదివారం ఉదయం ఓ ప్రకటనను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏదేనీ సంస్థ అంతగా కావాలని పట్టుబడితే యూఐడీఏఐ వెబ్ సైట్ నుంచి చివరి 4 అంకెలు మాత్రమే కనిపించే ‘మాస్క్‌డ్ ఆధార్ కార్డ్’ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది.
అయితే ఈ ప్రకటన నిమిషాల వ్యవధిలోనే వైరల్ కావడం, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కేంద్రం ఈ ప్రకటనపై వెనకడుగు వేసింది. ఆధార్ జిరాక్స్ కాపీలను కాకుండా మాస్క్‌డ్ ఆధార్ కార్డులను మాత్రమే వినియోగించాలని మాత్రమే సూచించామని, అయితే ఈ ప్రకటనను చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారని కేంద్రం తెలిపింది. ఈ కారణంగా ఉదయం విడుదల చేసిన ప్రకటనను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆధార్ ఐడెంటిటీ అథెంటికేషన్ ఎకో సిస్టమ్ అనేది ఆధార్ కార్డుల గోప్యతను రక్షిస్తుందని కూడా కేంద్రం వెల్లడించింది.