Drone: గ్రనేడ్లు, బాంబులతో కూడిన పాకిస్థాన్ డ్రోన్ ను కూల్చివేసిన జమ్మూ కశ్మీర్ పోలీసులు
- భారత్ లో అస్థిరతకు ఉగ్రమూకల ప్రయత్నాలు
- డ్రోన్ల ద్వారా భారత్ లోకి పేలుడు పదార్థాలు
- ఇటీవల తరచుగా ఘటనలు
భారత్ లో అస్థిరత రాజేయడానికి, ఆందోళనకర పరిస్థితులు సృష్టించడానికి పాకిస్థాన్ లోని ముష్కర మూకలు చేయని ప్రయత్నమంటూ లేదు. ఇటీవల కాలంలో డ్రోన్ల ద్వారా బాంబులను, మాదకద్రవ్యాలను సరిహద్దులు దాటిస్తున్న ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, సరిహద్దు దాటి వచ్చిన ఓ పాకిస్థానీ డ్రోన్ ను జమ్మూకశ్మీర్ పోలీసులు కూల్చివేశారు. ఈ డ్రోన్ లో ఏడు యూజీసీఎల్ గ్రనేడ్లు, ఏడు మాగ్నెటిక్ బాంబులు ఉన్నట్టు గుర్తించారు.
తాలీ హరియా చక్ ప్రాంతంలో భారత గగనతలంలోకి చొచ్చుకుని వచ్చిన ఈ డ్రోన్ ను సెర్చ్ పార్టీ పోలీసులు గుర్తించారు. దీన్ని కూల్చివేసిన అనంతరం, కథువా ఎస్పీ ఆర్సీ కోట్వాల్ స్పందించారు. అమర్ నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు జరిపేందుకే ఈ డ్రోన్ ద్వారా పాకిస్థాన్ వైపు నుంచి గ్రనేడ్లు, బాంబులు పంపారని వివరించారు. కాగా, 43 రోజుల పాటు సాగనున్న అమర్ నాథ్ యాత్ర జూన్ 30న ప్రారంభం కానుంది.