Rajya Sabha: ఈ 18 ఏళ్లలో ఒక్కసారి కూడా నా పేరు గుర్తుకు రాలేదా?: కాంగ్రెస్‌పై నటి నగ్మా ఆగ్రహం

Am I less deserving Upset Nagma tweets as Congress ignores her for Rajya Sabha

  • రాజ్యసభకు పదిమంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన కాంగ్రెస్
  • సీటు ఆశించి భంగపడిన నేతల గుర్రు
  • తన తపస్సులో ఏదైనా తగ్గి ఉంటుందేమోనన్న పవన్ ఖేరా
  • సోనియా స్వయంగా హామీ ఇచ్చి విస్మరించారని నగ్మా ఫైర్

వచ్చే నెల 10న జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రకటించిన 10 మంది అభ్యర్థుల జాబితా ఆ పార్టీలో చిచ్చు రేపుతోంది. రాజ్యసభ సీటు ఆశించి భంగపడిన కొందరు సీనియర్ నేతలు ట్విట్టర్ వేదికగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. రాజ్యసభ సీటును ఆశించిన ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా, కాంగ్రెస్ ముంబై యూనిట్ ఉపాధ్యక్షురాలు, నటి నగ్మా కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘‘నా తపస్సులో ఏదైనా తగ్గి ఉంటుందేమో’’ అని పవన్ ఖేరా ట్వీట్ చేయగా, ఆయన ట్వీట్‌కు నగ్మా స్పందించారు.

మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ ఎంపిక చేసిన ఇమ్రాన్ ప్రతాప్ గర్హిని ఉద్దేశించి.. తన 18 ఏళ్ల తపస్సు కూడా ఇమ్రాన్ భాయ్ ముందు తక్కువైందని నగ్మా వాపోయారు. 2003-04లో తాను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు తనను రాజ్యసభకు పంపుతానని పార్టీ చీఫ్ సోనియా గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికి 18 ఏళ్లు గడిచిపోయాయని, ఇన్నేళ్లలో వారు తనకు ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడేమో మహారాష్ట్ర నుంచి ఇమ్రాన్‌ను ఎంపిక చేశారని అన్నారు. ‘‘నేనేమైనా తక్కువ అర్హత కలిగి ఉన్నానా?’’ అని ఆమె ప్రశ్నించారు.

కాగా, 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ స్థానాలకు వచ్చే నెల 10న ఎన్నికలు జరగనుండగా ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటించాయి. రాజ్యసభలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు 29 మంది సభ్యులున్నారు. వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో రాజస్థాన్‌లో 3, ఛత్తీస్‌గఢ్‌లో రెండు, తమిళనాడు, ఝార్ఖండ్, మహారాష్ట్రలో ఒక్కోటి చొప్పున రాజ్యసభ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోవడం పక్కాగా కనిపిస్తోంది. హర్యానా, మధ్యప్రదేశ్, కర్ణాటకలోనూ ఒక్కోస్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ బలం 33కు చేరే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News