Manish Tewari: ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి వరుస ఘటనలు: కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ విమర్శలు
- పోలీసులను ముఖ్యమంత్రి విశ్వాసంలోకి తీసుకోవాలన్న మనీశ్
- శాంతి, భద్రతలను కాపాడాలని సూచించిన కాంగ్రెస్ నేత
- సరిహద్దు రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమని సూచన
కాంగ్రెస్ పార్టీ నేత, పంజాబ్ కు చెందిన ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య అనంతరం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ మాట్లాడుతూ.. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కొలువు దీరిన నాటి నుంచి వరుసగా దురదృష్టకర ఘటనలు చోటు చేసుకుంటున్నట్టు చెప్పారు. ఎవరో ఒకరు రాష్ట్ర ప్రభుత్వ సహనాన్ని పరీక్షిస్తున్నట్టుగా ఉందన్నారు.
‘‘పంజాబ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి వరుసగా దురదృష్టకర ఘటనలు జరుగుతున్నాయి. కబడ్డీ ఆటగాళ్లను చంపడం, మోహాలీలోని పంజాబ్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపై దాడి, జలంధర్ లో పోలీసులపై దాడి, ఇప్పుడు సిద్ధూ మూసేవాలా హత్య’’ అని కాంగ్రెస్ ఎంపీ తివారీ ఓ వార్తా సంస్థతో అన్నారు. ఆదివారం 28 ఏళ్ల గాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడైన సిద్ధూ మూసేవాలాను ఆగంతుకులు కాల్పి చంపడం తెలిసిందే.
పోలీసులను విశ్వాసంలోకి తీసుకోవాలని, పంజాబ్ లో శాంతి భద్రతల విషయంలో భరోసా కల్పించాలని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కు తివారీ సూచించారు. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్ లో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడితే అది ఎన్నో సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు.
‘‘వ్యక్తిగత భద్రత అంశానికి వస్తే.. రక్షణ కావాల్సిన వారి విషయంలో తగిన ఆడిట్ నిర్వహించాలి. ముఖ్యంగా పంజాబ్ లో ఉగ్రవాదంపై పోరాడే వారికి తగిన రక్షణ కల్పించాలి. వారిని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వంపై ఉంది’’ అని తివారీ పేర్కొన్నారు.