Nellore District: ఆత్మకూరు ఉప ఎన్నికలో తొలి రోజే రెండు నామినేషన్ల దాఖలు
- ఆత్మకూరు ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ
- నవతరం, పీపుల్స్ రిపబ్లికన్ పార్టీల తరఫున రెండు నామినేషన్లు
- పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన బీజేపీ
- 23న పోలింగ్, 26న ఓట్ల లెక్కింపు
ఏపీ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు సోమవారం నోటిఫికేషన్ జారీ అయ్యింది. నోటిఫికేషన్ జారీ కావడంతో సోమవారం నుంచే నామినేషన్ల దాఖలు మొదలైపోయింది. ఇందులో భాగంగా తొలి రోజుననే రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ నుంచి గోదా రమేశ్ కుమార్, నవతరం పార్టీ నుంచి రావు సుబ్రహ్మణ్యం నామినేషన్లు దాఖలు చేశారు.
నామినేషన్ల దాఖలకు జూన్ 6న గడువు ముగియనుంది. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 9 వరకు గడువు ఉంది. ఈ ప్రక్రియ ముగిశాక జూన్ 23న పోలింగ్ జరగనుంది. జూన్ 26న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్న అధికారులు అదే రోజు ఫలితాన్ని వెల్లడించనున్నారు.
గౌతమ్ రెడ్డి మరణంతో జరుగుతున్న ఈ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే రెండు నామినేషన్లు దాఖలు కాగా.. ఈ ఎన్నికలో పోటీ చేయనున్నట్లు ఇప్పటికే బీజేపీ కూడా ప్రకటించింది. అయితే టీడీపీ నుంచి ఈ ఎన్నికకు సంబంధించి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.